ప్రధానమంత్రి నరేంద్రమోడీ… నెల పూర్తి కాక ముందే రెండో సారి రాజకీయ పర్యటనకు వస్తున్నారు. ఈ సారి విశాఖలో గంటన్నర సేపు పర్యటించబోతున్నారు. ఇందులో గంట సేపు ప్రసంగానికి ఓ అరగంట… సభ గ్రౌడ్ నుంచి విమానం వద్దకు వెళ్లడానికి, రావడానికి కేటాయించారు. సాయంత్రం ఆరున్నరకు గంటలకు వైమానిక దళ ప్రత్యేక విమానంలో ఐ.ఎన్.ఎస్.డేగాకు చేరుకుంటారు. రైల్వే మైదానానికి వచ్చి ఏడు గంటలకుప్రసంగం ప్రారంభిస్తారు. ఎనిమిది గంటలకు వేదిక నుంచి విమానం వద్దకు బయలుదేరుతారు. మోడీ విశాఖలో కొత్తగా ఇచ్చే వరాలేమీ ఉండే అవకాశం లేదు. రైల్వేజోన్ ప్రకటిస్తారని అందరూ అనుకున్నారు కానీ.. రెండు రోజుల ముందు దాన్ని రైల్వే మంత్రి పీయూష్ గోయల్ ప్రకటించారు. విశాఖలో ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ అడ్డు ఉండటంతో… ఈ విధంగా ఢిల్లీలో ప్రకటించినట్లు భావిస్తున్నారు. ఈ కారణమే అయితే.. ఇక ఏ ఒక్క హామీని అమలు చేస్తామని మోడీ ప్రకటించే అవకాశం లేదు.
గుంటూరులో నిర్వహించిన సభలో పూర్తి సమయాన్ని టీడీపీ అధినేత చంద్రబాబుపై విమర్శలు చేయడానికే కేటాయించారు. మరి దిగువ స్థాయిలో… లోకేష్ కా పితాజీ అంటూ.. చంద్రబాబును విమర్శించారు. దానికి చంద్రబాబు కూడా.. “జశోదా బెన్ కా పతి” అంటూ.. కౌంటర్ ఇచ్చే ప్రయత్నం చేశారు. ఇది వివాదాస్పదం అయింది. మోడీ శైలి సహజంగానే రాజకీయ విమర్శలకు అనుగుణంగా ఉంటుంది.. ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాల గురించి పెద్దగా చెప్పరు. విశాఖలోనూ.. అదే ప్రసంగం రిపీట్ అవుతుందని.. కొత్తగా ఏమీ ఉండదని.. బీజేపీ వర్గాలు కూడా ఊహిస్తున్నాయి. అయితే.. డొల్ల రైల్వేజోన్ ఇచ్చారని నిరసనలు పెరుగుతున్న సమయంలోనే… తాము నెరవేర్చిన ఒకే ఒక్క హామీ గురించి గొప్పగా చెప్పుకోవడానికి ప్రాధాన్యం ఇస్తారని భావిస్తున్నారు.
మరోవైపు ప్రత్యేక హోదా, విభజన హామీలు నెరవేర్చని ప్రధానికి రాష్ట్రంలో పర్యటించే అర్హత లేదంటూ టీడీపీ, ఇతర పార్టీలు, ప్రజాసంఘాలు విశాఖలోమోదీ గో బ్యాక్ పేరుతో నిరసన కార్యక్రమాలు చేపడుతున్నారు. హోదా, విభజన హామీల సాధన సమితి ఆధ్వర్యంలో పలువురు ఆమరణ నిరాహారదీక్ష కూడా ప్రారంభించారు. దారి పొడవునా ప్రధానికి నల్లజెండాలతో నిరసన తెలియచేయాలని నిర్ణయించారు. విశాఖలో నల్లరంగుతో హోర్డింగ్ లు పెద్ద ఎత్తున ఏర్పాటు చేసారు. విభజన హామీలను అమలు చేయాలటూ… ప్రధాని వచ్చే మార్గాలలో వీటిని ఏర్పాటు చేశారు.