సరిహద్దుల్లో టెన్షన్, వింగ్ కమాండర్ పాకిస్తాన్ అధీనంలో ఉన్నారు. ఏ దేశ అధినేత అయినా ఏం చేస్తారు..?. రాజకీయ బహిరంగసభలకు ప్రయారిటీ ఇచ్చి వెళ్తారా..?. రెచ్చగొట్టే ప్రసంగాలు చేస్తూ.. నేనున్నా అని చెప్పుకుటూ తిరుగుతారా..? ఎవరైనా తిరుగుతారో లేదో కానీ.. మన ప్రధానమంత్రి నరేంద్రమోడీ మాత్రం తిరుగుతారు. సరిహద్దుల్లో ఉద్రిక్తతలు ప్రారంభమైన దగ్గర్నుంచి ఒక్క ఎన్నికల ర్యాలీని కూడా.. ఆయన వాయిదా వేసుకోలేదు. చివరికి అఖిలపక్ష సమావేశాల్ని కూడా… కూడా మంత్రులకు వదిలేసి.. ఆయన ఎన్నికల ప్రచారసభల కోసం వెళ్లిపోయారు.
యుద్ధమేఘాలు కమ్ముకుంటే మోడీ ఏం చేశారు..?
పుల్వామా దాడి జరిగిన తర్వాత రోజు.. దేశమంతా ఉద్రిక్తంగా .. ఉంది. ప్రజలు రగిలిపోతున్నారు. ప్రభుత్వం అన్ని పార్టీలను పిలిచి ఏం చేద్దామని అడిగింది. అలా అడిగిన సమావేశానికి మోడీ రాలేదు. ఓ వైపు ప్రతిపక్ష పార్టీలు కూడా… దేశభద్రత తమ బాధ్యతగా భావించి సమావేశానికి హాజరైతే..మోడీ మహారాష్ట్రలో ఓ ఎన్నికల ప్రచారసభలో పాల్గొన్నారు. అప్పట్నుంచి అవి అలా కొనసాగుతూనే ఉన్నాయి. మధ్యలో…ఓ విదేశీ పర్యనటకు వెళ్లి… వచ్చారు కూడా. ఇక సర్జికల్ స్ట్రైక్స్ చేశామని ప్రకటించిన రోజు.. కూడా ఆయన ఎన్నికల ర్యాలీలు ఆపలేదు. రాజస్థాన్‌లోని చురులో పార్టీ ర్యాలీలో పాల్గొన్నారు. పాకిస్తాన్‌ను రెచ్చగొట్టేలా పెద్ద పెద్ద డైలాగులు చెప్పారు. కానీ మీడియాలో మాత్రం.. ఆయన అన్నం తినలేదు.. నిద్రపోలేదు అన్న కథనాలు వచ్చాయి. కానీ ఆ రోజు ఎన్నికల ప్రచారంలో మాత్రమే కాదు..మరికొన్ని కార్యక్రమాల్లో పాల్గొన్నారు. అదే రోజు ఢిల్లీ మెట్రోలో ప్రయాణించి సెల్ఫీలు దిగారు. ఇస్కాన్ సాంస్కృతిక కేంద్రానికి వెళ్లి 800 కిలోల బరువున్న భగవద్గీతను ఆవిష్కరించారు. నిజానికి ఓ దేశభూభాగంలోకి వెళ్లి దాడులు చేశామని ప్రకటించుకున్న తర్వాత అంతర్జాతీయంగా వచ్చే ప్రతిస్పందనను తెలుసుకోవడానికి దేశాధినేత ఎవరైనా తన కార్యాలయంలో ఉంటారు. కానీ మోదీ మాత్రం పట్టించుకోలేదు. సుష్మస్వరాజ్ మీడియా సమావేశం ఏర్పాటు చేసి వివరాలు చెప్పాల్సి వచ్చింది.
దేశం కన్నా పార్టీ ప్రచారమే ముఖ్యమా..?
పాకిస్థాన్ మన భూభాగంలోకి ప్రవేశించి.. యుద్ధవిమానాలతో రచ్చ చేసి… మన ఫైటర్ పైలట్‌ను పట్టుకుపోయినప్పడైనా మోడీ… బాధ్యతగా వ్యవహరించారా.. అంటే అదీ లేదు. పాకిస్థాన్ దాడుల గురించి తెలిసిన తర్వాత కూడా.. ‘నేషనల్ యూత్ పార్లమెంట్ ఫెస్టివల్ లో పాల్గొన్నారు. ఓ యాప్ ను ప్రారంభించారు. ఇక అభినందన్ పాకిస్థాన్ చెరలో ఉండగానే బీజేపీ రికార్డు స్థాయి కార్యక్రమం అంటూ.. భారీగా ప్రచారం చేసుకుని బూత్ లెవల్ కార్యకర్తలతో రెండు గంటలకుపైగా వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. అందులోనూ ఆయన పాకిస్తాన్ ను నిందించి భావోద్వేగం పెంచాలని ప్రయత్నించారు తప్ప… ఇతర విషయాలు మాట్లాడలేదు. అంటే… సరిహద్దుల్లో ఎలాంటి పరిస్థితులు.. వచ్చినా… పట్టించుకోకుండా… అంతా పక్కనున్న మంత్రుల మీదకు తోసేసి.. తాను మాత్రం.. రాజకీయ పర్యటనలు కొనసాగిస్తున్నారు మోడీ.
బీజేపీపై భక్తి చూపడమే దేశభక్తినా..?
విపక్ష పార్టీలు ఈ విషయంలో చాలా బాధ్యతగా వ్యవహరించారు. కనీస ఉమ్మడి కార్యక్రమం గురించి చర్చించేందుకు ముందుగా నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం కాంగ్రెస్ పార్టీ నాయకత్వంలో 21 ప్రతిపక్ష పార్టీలు ఢిల్లీలో సమావేశమయ్యాయి. సరిహద్దుల్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో కనీస ఉమ్మడి కార్యక్రమం గురించి చర్చించుకోవడం భావ్యం కాదని పుల్వామా దాడిని ఖండించి సమావేశాన్ని వాయిదా వేసుకున్నాయి. అహ్మదాబాద్‌లో జరగాల్సిన పార్టీ సమావేశాన్ని, తన ర్యాలీని కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ రద్దు చేసుకున్నారు. చివరికి టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా లోక్‌సభ నియోజక వర్గాల సన్నాహక సమావేశాలను వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. కానీ అమిత్ షా మాత్రం.. ఉద్రిక్త పరిస్థితుల కారణంగా తమ పార్టీ కార్యక్రమాలను రద్దు చేసుకోలేమని తేల్చి చెప్పారు. ఈ పరిస్థితులు చూస్తూంటే.. దేశం అంటే.. బీజేపీ నేతలకు.. బీజేపీ మాత్రమేనని అనిపించకమానదు. దేశభక్తి అంటే.. వారికి బీజేపీ భక్తి. భారతదేశం కాదు..!