రిషి నువ్ ప్లేట్లు కడిగావా..అని ఆశ్చర్యపోతూ లవర్ అడిగితే… ఛీ నేను కడగడం ఏమిటి..? తుడిచాను అంతే.. అంటాడు.. చెక్ బౌన్స్ కేసులో మోహన్ బాబు స్పందన అచ్చంగా ఇందే ఉంది. వైవీఎస్ చౌదరికి ఇచ్చిన చెక్ బౌన్స్ కేసులో మోహన్‌బాబుకి ఎర్రమంజిల్ కోర్టు ఏడాది జైలు శిక్ష వేసింది. ఆయన కోర్టుకు కూడా హాజరయ్యారు. తీర్పు వచ్చిన వెంటనే ఆయన బెయిల్ పిటిషన్ వేసుకున్నారు. కోర్టు ఆయనకు నెల రోజులు గడువు ఇచ్చి రూ. 48 లక్షలు వైవీఎస్ చౌదరికి చెల్లించాలని ఆదేశించింది. లేకపోతే.. జైలుకెళ్లాలని స్పష్టంచేసింది. ఇదంతా కోర్టులో జరిగిన విషయం. దీనికి ఎర్రమంజిల్ కోర్టులో రికార్డులు ఉంటాయి. ఆ రికార్డుల ఆధారంగానే మీడియా రిపోర్ట్ చేసింది. కానీ మోహన్ బాబు మాత్రం.. ఓ ట్వీట్ చేశారు. అవన్నీ తప్పుడు వార్తలని.. తాను ఇంట్లోనే ఉన్నానని చెప్పుకొచ్చారు. బహుశా.. ఆయన వైసీపీలో చేరారు కాబట్టి.. జగన్ మీడియాలో ఎలాంటి వార్తలు రావు కాబట్టి.. ఎవరికీ తెలియదని అనుకున్నారో.. లేకపోతే.. ఆయా మీడియాలో వస్తే ఖండిస్తే… అందరూ నమ్మేస్తారని అనుకున్నారేమో కానీ… ఓ ట్వీట్ పడేశారు.
కానీ అప్పటికే విషయం మొత్తం బయటకు వచ్చింది. బెయిల్ తీసుకుని.. ముఫ్పై రోజుల్లోపు.. వైవీఎస్ చౌదరికి చెల్లించాల్సిన మొత్తం చెల్లించే షరతుతో ఇంటికి చేరుకున్నారు. కానీ అదంతా అబద్దమని చెప్పేసుకుంటే పోయిన పరువు వచ్చేస్తుందా..? ఏం జరిగిందో.. దాచేసుకుంటే దాగిపోతుందా..?. మొత్తం బయటకు వచ్చేసరికి.. ఓ వివరణ. సలీంకు ఇవ్వాల్సిన రెమ్యూనరేషన్ కాదని… కొత్త సినిమా కోసం ఇచ్చిన చెక్ అని చెప్పుకొచ్చారు. కోర్టును తప్పుదోవ పట్టించారని.. పైకోర్టులో తేల్చుకుంటామని మీడియాకు వివరించారు. అయితే… కోర్టులో శిక్ష పడిందన్నది మాత్రం నిజం.. ఆ విషయాన్ని మోహన్ బాబు.. అబద్దమన్నట్లుగా వ్యవహరిస్తున్నారు.
మామూలుగా అయితే మోహన్ బాబు… చెక్ బౌన్స్ కేసు .. ఇంత సంచలనం అయ్యేది కాదు. గతంలో జీవితారాజశేఖర్, బండ్ల గణేష్ లకు కూడా.. శిక్షలు పడ్డాయి. వారు కూడా.. సెటిల్ చేసుకున్నారు. జైలుకెళ్లలేదు. మోహన్ బాబు విషయం కూడా అలాగే అయ్యేది. కానీ ఆయన కొద్ది రోజుల కిందటి నుంచి ఓ రాజకీయ ఎజెండాతో.. వ్యవహారాలు నడిపారు. ఫీజు రీఎంబర్స్మెంట్ పేరుతో.. ఎన్నికల ముందు హడావుడి చేశారు. ఆ తర్వాత మూడు రోజులకే వైసీపీ కండువా కప్పుకున్నారు. రోజుమార్చి రోజు.. వైసీపీ కార్యాలయంలో ప్రెస్‌మీట్ పెట్టి.. చంద్రబాబుపై వ్యక్తిగత విమర్శలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే.. ఈ వార్త హైలెట్ అయితే.. జగన్ పార్టీలో చేరే వాళ్లంతా.. అలాంటి వాళ్లేననే విమర్శలు రావడంతో.. మోహన్ బాబు పరువు తక్కువగా భావించినట్లు ఉన్నారు. అందుకే అలాంటిదేమీ లేదని చెప్పుకునేందుకు ప్రాధాన్యం ఇచ్చారు.