మోహన్ బాబు మంత్రి అవంతి శ్రీనివారావుకు ఫిక్స్ చేసేశారు. ఏం చెప్పాలో తెలియని పరిస్థితిలో నెట్టేశారు. చివరికి ఏం చెప్పాలో తెలియక దిక్కులు చూస్తూంటే కేంద్రమంత్రి కిషన్ రెడ్డి కల్పించుకుని అవంతిని వదిలేయాలంటూ సూచించడంతో మోహన్ బాబు టాపిక్ మార్చేశారు. ఈ ఘటన హైదరాబాద్ ఫిలింనగర్ కల్చర్ క్లబ్లో జరిగింది.ఆజాది కా అమృత్ మహోత్సవ్ కార్యక్రమంలో భాగంగా అల్లూరి 125వ జయంతి ఉత్సవాలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఏపీ నుంచి మంత్రిఅవంతి హాజరయ్యారు. మోహన్ బాబుతో పాటు పలువురు ప్రముఖులు హాజరయ్యారు.
ఈ సందర్బంగా అల్లూరి గురించి మాట్లాడుతూ మోహన్ బాబు .. తన టాపిక్‌ను ఒక్క సారిగా మంత్రి అవంతి వైపు మళ్లించారు. అల్లూరి పుట్టిన గడ్డ నుంచి రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలిచావు ఆయన కోసం ఏం చేశావని ప్రశ్నించారు. దీంతో అవంతికి ఏం చెప్పాలో తెలియదు. చెప్పడానికి ఏమీ లేదు. అల్లూరి కోసం ఏదో ఒకటి చేయాలనే ఆలోచన కూడా అవంతికి అప్పటికి వచ్చి ఉండదు. మొదటి సారి పీఆర్పీ తరపున గెలిచారు. కొన్నాళ్లు అధికార పార్టీలో ఉన్నారు. తర్వాత ఎంపీగా అధికార పార్టీలో ఉన్నారు. తర్వాత మళ్లీ ఎమ్మెల్యేగా… మంత్రిగా అధికార పార్టీలో ఉన్నారు. పైగా టూరిజం మంత్రిగా ఉన్నారు. కానీ అల్లూరి కోసం ఏమీ చేయలేదు.
మోహన్ బాబు అలా అడుగుతాడని ఊహించలేకపోయిన మంత్రి అవంతి బిక్కమోహం వేశారు. చివరికి కిషన్ రెడ్డి చెప్పాడు కాబట్టి వదిలేస్తున్నాననని అన్నారు. ఇది ఈ కార్యక్రమంలోనే హైలెట్ అయింది. గత ఎన్నికలకు ముందు వైసీపీలో చేరిన మోహన్ బాబు ఇటీవల తాను ఆ పార్టీలో లేనట్లుగా మాట్లాడుతున్నారు. ఇప్పుడా పార్టీ మంత్రిని ఇరుకున పెట్టేట్లుగా మాట్లాడారు.