స్టార్ ఇంట్లోంచి మరో హీరో వస్తున్నాడంటే అంచనాలు, ఆశలు తారా స్థాయికి చేరతాయి. మా హీరో ఎలా ఉంటాడో? ఏం చేస్తాడో? అంటూ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తుంటారు. ప్రస్తుతం అలాంటి అంచనాలే మోక్షజ్ఞపై ఉన్నాయి. స్టార్ తనయుడి డెబ్యూ అంత తేలికైన విషయం కాదు. అందుబాటులో ఎన్నో వనరులుంటాయి. కాకపోతే వాటిని ఏమాత్రం సద్వినియోగపరచుకున్నాం? వారసుడ్ని ప్రేక్షకులకు ఏ రూపంలో పరిచయం చేస్తున్నాం? అనేదే ముఖ్యం. డెబ్యూ సినిమా తేడా కొడితే… మళ్లీ మేల్కొని నిలదొక్కుకోవడం చాలా కష్టం. అందుకే మోక్షజ్ఞ విషయంలో బాలయ్య కూడా తొందర పడడం లేదు.
అఖిల్ ఎంట్రీకి ముందు ఇలాంటి హడావుడే జరిగింది. పరిశ్రమలోని దిగ్గజ దర్శకులు, కథకులు అఖిల్‌కి కథలు వినిపించారు. ఎన్నో కథలు విన్న తరవాత అఖిల్‌ని వినాయక్ చేతిలో పెట్టారు. కాంబినేషన్ పరంగా క్రేజ్ సంపాదించిన ఈ సినిమా.. బాక్సాఫీసు దగ్గర బోల్తా పడింది. నాగచైతన్య విషయంలోనూ ఇదే సీన్ జరిగింది కదా? అప్పట్లో అద్భుతమైన ఫామ్‌లో ఉన్న దిల్ రాజు నిర్మాతగా `జోష్` తీశాడు. దిల్‌రాజు బ్యానర్ వాల్యూ తోడై.. అంచనాలు పెరిగాయి. కానీ ఆ సినిమా వాటిని అందుకోలేదు. చిరంజీవి అల్లుడు కల్యాణ్ దేవ్ కూడా అంతే. `విజేత` అంటూ మామగారి టైటిల్‌ని వాడుకున్నాడు. సాయి కొర్రపాటి లాంటి నిర్మాత దొరికాడు. టెక్నికల్ గానూ మంచి టీమ్ అండగా నిలిచింది. అయినా విజేతగా నిలవలేకపోయాడు. హీరో డెబ్యూకి కావల్సింది… సాంకేతిక హంగు ఆర్భాటాలు కాదు, మంచి కథ అని ఈ పరాజయాలు నిరూపించాయి. తొలి సినిమాతోనే అన్నీ చేయించేసేయాలని చూడకుండా… క్రమ క్రమంగా అతనిలో ఉన్న టాలెంట్ బయటపెట్టేలా చేయాలి. ముందు మోక్షజ్ఞ ఏ విషయంలో స్ట్రాంగో, అతని బలాలేమిటో, బలహీనతలేమిటో బాలయ్య లెక్కలేసుకోవాలి. తన బలాల్ని ఎలివేట్ చేసే కథని ఎంచుకోవాలి. బాలయ్య ఆలోచన కూడా అదే. తొలి సినిమాతో మితిమీరిన హడావుడి చేయకుండా, కాస్త సైలెంట్‌గా వస్తే మంచిదని ఆలోచిస్తున్నాడు. పెద్ద దర్శకులు అందుబాటులో ఉన్నా, యువతరం వైపు చూస్తున్నాడు. కథ సెట్టయిపోతే, మిగిలిన విషయాల గురించి పెద్దగా ఆలోచించాల్సిన అవసరం లేదు. ఆ కథ కోసమే బాలయ్య అన్వేషిస్తున్నాడిప్పుడు.