కామెడీ సినిమాల్లో ఓ మైలు రాయి…’మనీ’. ఈ సినిమాతో చాలామంది ప్రతిభావంతులు వెలుగులోకి వచ్చారు. కొంతమంది జీవితాల్ని ఈ సినిమా మార్చేసింది. ముఖ్యంగా బ్రహ్మానందం కెరీర్ బెస్ట్.. ఖాన్ దాదా పాత్ర ఈ సినిమాలోనిదే. ఆ ప్రభావం ఇప్పటికీ ఉంది. ఈ సినిమా విడుదలై నేటికి సరిగ్గా ముఫ్ఫై ఏళ్లు. శివ నాగేశ్వరరావు దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో జెడీ, చిన్నా హీరోలు. వర్మ నిర్మాత.
శివ సినిమా దగ్గర్నుంచీ వర్మ దగ్గర కో డైరెక్టర్గా పని చేస్తూ వచ్చారు శివ నాగేశ్వరరావు. ఆయనంటే వర్మకి గురి. అందుకే తన దగ్గరే పర్మినెంట్గా ఉండిపోమని అడిగితే.. ‘దర్శకత్వం చేయడం నా కల..’ అంటూ ఖరాఖండీగా చెప్పేశారు నాగేశ్వరావు. ఆయన కోసం వర్మనే నిర్మాతగా మారి.. ‘మనీ’ తీయాల్సివచ్చింది. ‘రూత్లెస్ పీపుల్’ అనే ఓ హాలీవుడ్ సినిమా ఈ చిత్రానికి స్ఫూర్తి. 30 లక్షల్లో పూర్తయ్యింది. రూ.3 కోట్లు వచ్చాయి. జయసుధ – పరేష్ రావల్ కీలక పాత్రలు పోషించారు. వాళ్ల ట్రాకే ఈ సినిమాకి మూలం. పరేష్ రావల్ పాత్ర కోసం ముందు ఎస్పీ బాలుని అనుకొన్నారు. ఆయనకు కథ, పాత్ర రెండూ నచ్చాయి. కానీ.. ఒకే ఒక్క షరతు పెట్టారు. `ఈ సినిమాకి వర్మ దర్శకుడు అయితేనే.. నేను నటిస్తా` అన్నారు. దాంతో బాలుని పక్కన పెట్టాల్సివచ్చింది. ఓదశలో దాసరి పేరు కూడా బయటకు వచ్చింది. కానీ `క్షణ క్షణం`లో నటించిన పరేష్ రావల్ బాడీ లాంగ్వేజ్ నచ్చి ఆయన్ని ఫైనల్ చేశారు. జయసుధ పాత్రకు రాధిక అయితే బెటర్ అన్నది శివ నాగేశ్వరరావు ఆప్షన్. కానీ వర్మ ఒప్పుకోలేదు. జయసుధ అయితేనే ఈ సినిమా నేను నిర్మిస్తా.. అని ఆయన మరో కండీషన్ పెట్టారు. శివ నాగేశ్వరరావుకి ఒప్పుకోక తప్పలేదు.
మనీ సినిమా చూస్తే ఖాన్ దాదా పాత్ర ని మర్చిపోలేరు. అంతలా ఆ పాత్ర మనల్ని వెంటాడుతుంది. నిజానికి మనీ కథ రాసేటప్పుడు ఈ పాత్రే లేదు. సినిమా అంతా పూర్తయ్యాక నిడివి తగ్గిందనిపించి – ఓ కామెడీ ట్రాక్ పెట్టాల్సివచ్చింది. అది ఖాన్ దాదా అయ్యింది. అయితే ఈ సినిమా చూస్తే ఎక్కడా అది అతికించిన ట్రాక్ అనిపించదు. కథలో భాగంగా ప్రయాణం చేస్తున్నట్టే ఉంటుంది. ఈ సినిమా బ్రహ్మనందానికి ఎంత పేరు తీసుకొచ్చిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. కామెడీ సినిమాల్లో పాటలకు పెద్దగా స్థానం ఉండదు అనుకొంటారు. కానీ ఈ సినిమాలో పాటలన్నీ హిట్టే. ముఖ్యంగా చక్రవర్తికీ వీధి బిచ్చగత్తెకీ, లేచిందే లేడికి పరుగు.. సూపర్ డూపర్ హిట్లు. ఈ చిత్రానికి సీక్వెల్ గా మనీ – మనీ కూడా వచ్చింది. తెలుగులో సీక్వెల్ సినిమాల పరంపరకు అదే శ్రీకారం. అయితే మనీ స్థాయిలో మనీ మనీ ఆడలేదు.