ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికల షెడ్యూల్ రాజకీయ పార్టీలకు.. అభ్యర్థులకు కూడా షాక్ ఇచ్చింది. ఎందుకంటే.. మొదటి విడతలోనే ఎన్నికలు పూర్తవుతాయని అనుకున్నారు. కానీ నాలుగో విడతలో ఎన్నికలు పెట్టడంతో ఖర్చులు రెట్టింపు అయ్యే పరిస్థితి ఏర్పడింది.
ఇప్పటికే ఒక్కో నియోజకవర్గంలో అభ్యర్థికి కనీసం ఎంత లేదన్నా రోజుకు ఇరవై లక్షల వరకూ ఖర్చు పెట్టాల్సి వసతోంది. ఇది అంతకంతకూ పెరుగుతూ ఉంటుంది.. చివరికి ఏ స్థాయికి చేరుతుందో అంచనా వేయడం కష్టమైన రాజకీయంగా మారుతోంది.
వైసీపీ నేతల అవినీతి గురించి విస్తృతంగా చర్చ జరుగుతున్న సమయాల్లో..వారు ఎన్నికలకు వచ్చిన సమయంలో ఎంతో ఇస్తారని ఆశ పెట్టుకుంటున్నారు. ఒక్కో ఓటుకు ఐదు నుంచి పదివేల రూపాయలు ఎక్స్ పెక్ట్ చేస్తున్న సందర్భాలు ఉన్నాయి. ఈ సారి అది మరింత ఎక్కువగా కనిపిస్తోంది. మన దేశంలో రాజకీయ అవినీతిని ఎవరూ కాదనలేరు. ఎమ్మెల్యేలు వందల కోట్లకు పడగలెత్తుతున్నారు. అయితే ఇలా అవినీతిని చట్టబద్దంగా చూపించుకోవడం దాదాపు అసాధ్యం. ప్రభుత్వం ఉన్నంత కాలం ఎలాగోలా అనుభవించినా తర్వాత దొరికిపోతారు.
అందుకే ఎక్కువ మంది రాజకీయ నేతలు ఈ రాజకీయ అవినీతి ద్వారా వచ్చిన సొమ్మును తర్వాత ఎన్నికల్లో పెట్టుబడిగా పెట్టి పంచేస్తూంటారు. ఇలా .. రాజకీయ అవినీతి ద్వారా పోగుపడిన సొమ్ము ఎన్నికల సమయంలో ప్రజల చేతుల్లోకి వెళ్తోంది. ఎన్నికల సమయంలో ప్రజల కొనుగోలు శక్తి కూడా కాస్తంత పెరుగుతుందంటే దీనికి కారణం ఈ సొమ్మే. ఎన్నికల ఖర్చు వల్ల.. నేతల అవినీతి పెరుగుతుంది.. అలాగే అవినీతి సొమ్ము కూడా ప్రజల్లోకి వస్తుందని సర్దుకోవడమే. ఎందుకంటే..దీన్ని కంట్రోల్ చేసేంత బలమైన వ్యవస్థలు ఇంకా మన ప్రజాస్వామ్యంలో పెరగలేదు. ఇంకా చెప్పాలంటే పెరగనీయలేదు.