`మోరల్ పోలిస్’ ….ఈ పేరు మీరు వినేఉంటారు. దేశంలో మన సాంప్రదాయాలు ఎక్కడ మంటగలిసిపోతాయోనన్న భయంతో అనునిత్యం అప్రమత్తతో కాపుకాచి దాడులు జరిపే మతఛాందస అనధికారిక నిఘావ్యవస్థ ఇది. మోరల్ పోలిసింగ్ పేరిట హిందూత్వ సంస్థలకు చెందిన ముఠాలు నవ్యనాగరికతపై కన్నెర్రచేస్తుంటాయి. అమ్మాయి, అబ్బాయి కలిసితిరిగితేచాలు వీరు కన్నెర్రచేస్తారు. ఆగ్రహంతో ఊగిపోతారు. దాడులకు దిగుతారు. భీభత్సం సృష్టిస్తారు. ఇదీ మోరల్ పోలిస్ లు చేసే రాచకార్యం. రాజ్యాంగం వీరికి ఎలాంటి హక్కులు కట్టబెట్టలేదు. ప్రభుత్వాలు పనిగట్టుకుని వీరిని నిఘానేత్రాలుగా నియమించనూలేదు. అయినా మతఛాందస ధోరణితలెక్కడంతో పెట్రేగిపోతుంటారు. తమ పరిధిదాటి హింసాత్మక చర్యలకు పాల్పడుతుంటారు. చట్టాన్ని తమచేతుల్లోకి తీసుకుంటారు. ప్రేమికుల దినోత్సవం రోజున భజరంగ్ దళ్ వంటి హిందూత్వ సంస్థలకు చెందినవారమని చెప్పుకునే కొన్ని ముఠాలు చెలరేగిపోతాయి. పార్కుల్లో కలిసి కబుర్లు చెప్పుకునే జంటలపై తమ ప్రతాపం చూపడం మనకు తెలిసిందే. నవ్య సమాజం గాడితప్పుతుందన్నది వీరి భావన. బెత్తం పుచ్చుకుని డిసిప్లీన్ నేర్పాలని ఇలాంటి ముఠాలు ప్రయత్నిస్తున్నాయి.
ముస్లీం కుర్రాడికి పరాభవం
ఇప్పుడివన్నీ ఎందుకు ప్రస్తావించాల్సివచ్చిందంటే, మంగళూరులో తాజాగా ఇలాంటి ముఠా ఒక ముస్లీం కుర్రాడిని పట్టుకుని బట్టలూడదీసి, ఎలక్ట్రిక్ స్తంభానికి కట్టేసి దేహశుద్ధిచేశారు. ఇదంతా సోమవారం (24-08-2015) సాయంత్రం మంగళూరులోని అత్తావర్ దగ్గర అంతా చూస్తుండగా జరిగిన ఘటన.
ఇంతకీ ఈ ముస్లీం యువకుడు చేసిన పాపమేమిటీ? షకీర్ అనే కుర్రాడు మంగళూరులోని `ఈజీడే సూపర్ మార్కెట్’ లో పనిచేస్తున్నాడు. అదేచోట పనిచేస్తున్న ఒక అమ్మాయిని తన కారులో కలిసివెళదామని అన్నాడు. అంతే, ఈ విషయం మోరల్ పోలీసులుగా చెప్పుకునే హిందుత్వ ముఠా సభ్యులకు తెలిసిపోయింది. అదునుచూసి దాడికి దిగారు. ఆ యువకుణ్ణి పరాభవించారు.
ఇది జరిగాక పోలీసులు రంగప్రవేశం చేశారు. సంఘటనతో సంబంధంఉందన్న అనుమానంతో 13మందిని అరెస్టు చేశారు. బజరంగ్ దళ్ ప్రమేయం ఉన్నదోలేదో విచారణలో తేలుతుందని సెలవిచ్చారు.
ఇది కొత్తకాదు
మోరల్ పోలీసింగ్ దాడులు కొత్తేమీకాదు. కర్నాటక కోస్తాతీరప్రాంతంలోనే ఇప్పటికే వందలాది సంఘటనలు ఇలాంటివి జరిగాయి. హిందూ రైటి వింగ్ మద్దతిస్తున్న రాజకీయ పార్టీ పాలనాపగ్గాలు చేపట్టినప్పటి నుంచీ వీరి దాడులకు అంతూపొంతూలేకుండా పోతోందనే చెప్పాలి. యువసంఘాలూ,సంస్థలు పుట్టగొడుగుల్లా పుట్టుకువస్తున్నాయి. సమాజానికి డిసిప్లీన్ నేర్పుతున్నామన్న భావనలో దాడులకు బరితగిస్తున్నాయనీ, పౌరులను భయభ్రాంతులకు గురిచేస్తున్నాయని పోలీస్ అధికారులే అంటున్నారు. ఇలాంటి దాడుల్లోచాలామటుకు చాలా సంఘటనలు పోలీసు స్టేషన్ దాకా రావడంలేదు. అయినప్పటికీ ఈఏడాదే ఇప్పటివరకు ఈ ప్రాంతంలో 12 మోరల్ పోలిసింగ్ సంఘటనలు వెలుగుచూశాయి.
ఈ తరహా దాడులతో తల్లిదండ్రులు భయపడాల్సి వస్తోంది. అమ్మాయి-అబ్బాయి కలిసి ఐస్ క్రీమ్ తింటున్నా దాడులు జరిగే పరిస్థితులు ఉండటంతో పెద్దలు ఆందోళన చెందుతున్నారు. అమ్మాయి- అబ్బాయి వేరువేరు మతాలకు చెందినవారైతే మోరల్ పోలీసింగ్ ముఠాల దాడి తీవ్రత మరీ దారుణంగా ఉంటున్నది. భద్రత అన్నది ఇక్కడ ఎండమావిఅయిపోయిందని వాపోతున్నారు.
పబ్బులమీద, బార్లమీద లేదా నైట్ పార్టీలు జరిగే క్లబ్స్ మీద దాడులు జరపిన సంఘటనలు చాలానే ఉన్నాయి. భారత నేరశిక్షాస్మృతిలో అసభ్యత, అశ్లీలత వంటి సమాజవ్యతిరేక చర్యలను అదుపుచేయడానికీ, నేరాలకు పాల్పడినవారిని దండించడానికి కొన్ని సెక్షన్స్ ఉన్నాయి. వాటిలో కొన్నింటికి సవరణలు కూడా చేయాల్సివచ్చింది. ఆధునిక నాగరికతను దృష్టిలో ఉంచుకుని 1860నాటి సెక్షన్లను తిరగరాయాల్సివచ్చింది. ఇంత జరుగుతున్నా మరోపక్కన మోరల్ పోలీసింగ్ పేరిట దాడులు జరుగుతూనే ఉన్నాయి. వారి దృష్టిలో అశ్లీలత అనిపిస్తేచాలు, వెంటనే వాలిపోయి, దాడులకు దిగుతున్నారనీ, దీంతో సభ్యసమాజం విస్తుపోవాల్సివస్తున్నదని అభ్యుదయవాదులంటున్నారు.
2005లో తమిళనటి కుష్బూ ఒక సందర్బంలో సెక్స్ విషయంలో చేసిన సంచనల వ్యాఖ్యలకు మండిపడ్డ ఛాందసవాదులు ఆమె కారుపై దాడికి పాల్పడ్డారు. 2009 జనవరి 24న మంగళూరు పబ్ మీద దాడి జరిగింది. అమ్నేసియా – ద లాంజ్ అనే పబ్ లో శ్రీరామసేన అనే సంస్థకు చెందిన యువకులు దాడికి దిగారు. మహిళలు బహిరంగంగా మద్యపానం తాగకూడదన్నది వీరి వాదన. అలాగే, 2012లో కూడా ఒక పార్టీ జరుగుతుండగా హిందూ జాగరణ వేదిక కార్యకర్తలమని చెప్పుకున్న వ్యక్తులు ఎటాక్ చేశారు. ఐదుగురు అమ్మాయిలు కూడా ఈ దాడుల్లో గాయపడ్డారు.
అసభ్యత, అశ్లీలం వంటి సంఘటనలు జరిగినప్పుడు కచ్చితంగా పోలీస్ సెక్షన్ల ప్రకారం కేసులు పెట్టాల్సిందే. ఇందులో తప్పులేదు. ఆపని పోలీసులు చేస్తూనే ఉన్నారు. వారికి సహకరించడం లేదా సమాచారం అందించడంవరకూ మంచిదే. కాకపోతే అత్యుత్సాహంతో తామే పోలీసుల్లా వ్యవహరిస్తూ నైతిక విలువలను కాపాడటంకోసమే ఇలా దాడులుకు దిగుతామని రెచ్చిపోవడం నిస్సంకోచంగా అభ్యంతరకరమే.
– కణ్వస