ఏపీలో మద్యం బ్రాండ్స్ అంటే అందరూ నవ్వేస్తుంటారు. ఎవరికీ తెలియని, ఎప్పుడూ వినని, ఎక్కడా చూడని మద్యం బ్రాండ్స్ కనపడుతుంటాయి. ఈ మద్యం బ్రాండ్స్, పేర్లపై వచ్చే మీమ్స్ అన్నీ ఇన్నీ కావు. ఇప్పుడు ఆ బాటలోనే రేవంత్ సర్కార్ కూడా పయనిస్తోంది.
తెలంగాణలోనూ కొన్ని రోజులుగా కొత్త మద్యం బ్రాండ్స్ కు అనుమతులు జారీ అవుతున్నాయి. స్వయంగా మేం అనుమతులు ఇవ్వలేదు అని అబ్కారీ మంత్రి చెప్పినా ఎక్సైజ్ శాఖ అనుమతి ఇచ్చేసింది. ఆ తర్వాత మంత్రి వివరణ ఇచ్చుకోవాల్సి వచ్చింది. మొన్న హంటర్ అనే బీర్లకు అనుమతులు రాగా, ఇప్పుడు మరో మూడు మద్యం బ్రాండ్లకు అనుమతి ఇచ్చింది తెలంగాణ సర్కార్. అయితే, ఈ మూడు కూడా బీర్ల కంపెనీలే.
తాజాగా అనుమతి వచ్చిన వాటలో మౌంట్ ఎవరెస్ట్ బ్రూవరీస్ కంపెనీకి చెందిన దబాంగ్, లీమౌంట్, మౌంట్స్ అనే బీర్లున్నాయి. త్వరలోనే ఇవి వైన్స్ షాప్ లలో అందుబాటులోకి రాబోతుండగా, సింఘా బీర్ కు కూడా అనుమతి వచ్చింది. వీటికి తోడు ఎగ్జాటిక్ అనే బీర్లకు కూడా అనుమతి ఇచ్చింది.
నిజానికి ఇప్పటికే ఉన్న ప్రముఖ కంపెనీ బీర్లకు మంచి డిమాండ్ ఉంది. వేసవి కూడా కావటంతో బీర్ల కొరత ఉంది. ఈ కొరత చూపి అబ్కారీ శాఖ కొత్త కంపెనీలకు అనుమతి ఇస్తుంది. కానీ, ఆ ప్రముఖ కంపెనీల్లో రెండు షిఫ్టుల్లో బీర్ల ఉత్పత్తి జరుగుతుండగా… కొరత ఉంది కాబట్టి మూడో షిఫ్టులో కూడా ఉత్పత్తికి పర్మిషన్ ఇవ్వమని ఆయా కంపెనీలు అడిగినా, సర్కార్ ఇవ్వలేదు. కానీ, ఇప్పుడు కొరత చూపి, కొత్త బ్రాండ్స్ కు… అందులోనూ నాసిరకం కంపెనీలు అని పేరున్న వాటికి కూడా అనుమతి ఇవ్వటం వివాదాస్పదం అవుతోంది.