వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీనుంచి నలుగురు ఎమ్మెల్యేలు, ఒక ఎమ్మెల్సీన తెలుగుదేశం పార్టీలో చేరిపోయారు. నేను తలచుకుంటే.. చంద్రబాబు ప్రభుత్వం గంటలో కూలిపోతుంది. ఆ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు చాలా మంది నాతో టచ్‌లో ఉన్నారు. వారి సంఖ్య 21 కు చేరగానే.. పేర్లు ప్రకటిస్తాను. ప్రభుత్వం కూలుతుంది.. అంటూ ప్రతిపక్షనేత జగన్మోహనరెడ్డి డాంబికంగా సెలవిచ్చి వారం రోజులు కూడా గడవక ముందే.. చంద్రబాబు తన చాణక్యాన్ని ప్రదర్శించారు. ఆయన పార్టీనుంచే తెదేపాలోకి ఎమ్మెల్యేలను ఆకర్షించారు.
చేరికల విషయంలో చాలా రాజీచర్చలు, రకరకాల పరిణామాలు మధ్యలో చోటు చేసుకున్నప్పటికీ.. మొత్తానికి నలుగురు ఎమ్మెల్యేలు, ఒక ఎమ్మెల్సీ వైకాపానుంచి సోమవారం రాత్రి 9 గంటల సమయంలో చంద్రబాబు నివాసంలో ఆయన సమక్షంలో తెలుగుదేశంలో చేరారు. దీంతో తెదేపా ఎమ్మెల్యేల సంఖ్య 106కు పెరిగినట్లు అయింది. వైకాపా ఎమ్మెల్యేల సంఖ్య 67 నుంచి 63 కు పడిపోయింది. సోమవారం రాత్రి చేరిన వారిలో భూమా నాగిరెడ్డి, ఆయన కుమార్తె అఖిలప్రియ, దేవగుడి ఆదినారాయణరెడ్డి, జలీల్‌ఖాన్ ఎమ్మెల్యేలు కాగా, ఎమ్మెల్సీ దేవగుడి నారాయణరెడ్డి కూడా చేరారు.
అయితే ఈ అయిదు చేరికలను చంద్రబాబు ఆకర్ష రాజకీయాలకు తొలి అంకంగా మాత్రమే భావించాల్సి ఉంటుంది. వైఎస్సార్ కాంగ్రెస్‌నుంచి తెలుగుదేశంలో చేరడానికి ఇంకా చాలా మంది ఎమ్మెల్యేలు తెరవెనుక తమంతనాలు సాగిస్తున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. తమ తమ జిల్లాల్లోని కీలక నేతలు, మంత్రులతో వారు టచ్‌లో ఉండి తమకు తగిన ఆఫర్లు మాట్లాడుకుంటున్నారు. మరి కొన్ని రోజుల్లో ఇంకా వైకాపానుంచి మరిన్ని చేరికలు తెలుగుదేశంలోకి ఉండే అవకాశం ఉంది.