ఆగస్టు 15న బాక్సాఫీసు దగ్గర గట్టి పోటీ ఉన్న సంగతి తెలిసిందే. ఆ రోజు మిస్టర్ బచ్చన్, డబుల్ ఇస్మార్ట్ వస్తున్నాయి. ఆగస్టు 16న ‘ఆయ్’ విడుదల చేస్తున్నారు. అయితే మిస్టర్ బచ్చన్ బొమ్మ ఒకరోజు ముందే పడబోతోంది. 14న హైదరాబాద్ లో ప్రీమియర్లు ప్లాన్ చేశారు. మీడియాతో పాటు సినీ ప్రముఖులకు ఈ సినిమాని ముందే చూపిస్తున్నారు. ఫ్యాన్స్ కు కూడా షోలు ఉన్నాయి. అలా.. ఒక రోజు ముందే పంద్రాగస్టు సినిమాల సందడి కనిపించబోతోందన్నమాట. 15న ‘ఆయ్’ రావాలి. అయితే ఇప్పుడు ఈ సినిమాని 16న రిలీజ్ చేస్తున్నారు. ‘ఆయ్’ ప్రీమియర్లు కూడా 15నే పడబోతున్నాయి. సాయింత్రానికల్లా ‘ఆయ్’ టాక్ బయటకు వచ్చేస్తుంది. ‘తంగలాన్’ ప్రీమియర్ షోలు తెలుగులో లేవు. అయితే తమిళనాట ఫ్యాన్స్ కోసం ముందే బెనిఫిట్ షోలు ప్రదర్శించే అవకాశం ఉంది.
ప్రీమియర్ల వల్ల ఫ్యాన్స్ లో జోష్ వస్తుంది. థియేటర్ల దగ్గర సందడి కనిపిస్తుంది. ఒకరోజు ముందే సినిమా చూసేశామన్న ఆనందం దక్కుతుంది. టాక్ బాగుంటే, రిలీజ్ రోజున ఇక చూసుకోవాల్సిన పనిలేదు. కానీ తేడా వస్తే మాత్రం నిర్మాతలకు చుక్కలు కనిపిస్తాయి. థియేటర్లు నింపుకోవడమే గగనం అయిపోతుంది. అందుకే… ఈమధ్య ప్రీమియర్లు అంటే నిర్మాతలు హడలిపోతున్నారు. కానీ ‘మిస్టర్ బచ్చన్’ మాత్రం ప్రీమియర్ల వైపు మొగ్గు చూపిస్తోంది. బహుశా.. అవుట్ పుట్ పై వాళ్లకంత నమ్మకమేమో..?!