కాపు నాయకుడు ముద్రగడ పద్మనాభం విషయంలో రాష్ట్ర ప్రభుత్వం కఠినంగా వ్యవహరించాలని నిర్ణయించుకున్నట్టు స్పష్టమవుతున్నది. ఆయన పాదయాత్రను అడ్డుకుని 24 గంటల గృహ నిర్బంధం విధించినట్టు ప్రకటించిన ప్రభుత్వం ఇప్పుడు దాన్ని ఆగష్టు 2 వరకూ పొడగించింది. ఈ మేరకు జిల్లా కలెక్టర్ జారీ చేసిన ఉత్తర్వును పోలీసు ఓఎస్డి రవిశంకర్ అందజేశారు. ఈ విధంగా వారం పాటు బంధించడం సరికాదని ముద్రగడ నిరసన తెల్పినా ఫలితం లేదు. ఈ లోగా వివిధ జిల్లాల నుంచి కాపులు కిర్లంపూడి బయిటు దేరినట్టు సమాచారం వస్తున్నది. రాష్ట్ర వ్యాపితంగా అనేక చోట్ల 144వ సెక్షన్, 30 వ సెక్షన్ ప్రకటించడంపై రాజకీయ పార్టీల నుంచి తీవ్ర ఆ గ్రహం వ్యక్తమవుతున్నది. చంద్రబాబు ఇచ్చిన హామీ అమలు కోసం ముద్రగడ ఆందోళన చేస్తున్నప్పుడు ఆయనతో మాట్లాడి పరిష్కారం కనుగొనాల్సిన బాధ్యత ప్రభుత్వంపైనే వుంటుంది. దానికి మారుగా నిర్బంధాలు నిషేదాలు, రాజకీయ దాడులు పోలీసు మొహరింపులు పరిస్తితిని దిగజారుస్తాయి. ఆందోళన కరంగా మారుస్తాయి. ముద్రగడ జగన్ ఆదేశాల ప్రకారమే ఇదంతా చేస్తున్నారన్న ఆరోపణ అర్థ రహితమని ఆయన అనుయాయులే చెబుతున్నారు. కనీసం రెండు మూడు సందర్భాల్లో తాను జగన్ తీరుపై అసంతృప్తి చెందినట్టు ముద్రగడ చెప్పారట. పైగా అతిశయంలోనూ ఎవరికీ ఎవరు తీసిపోరు. మరి ఈ ప్రచారం ఉద్దేశపూర్వకమో లేక వ్యూహాత్మకమో ప్రభుత్వమే చెప్పాలి. పాదయాత్రను ముందస్తుగా అడ్డుకోవడం మాత్రం అప్రజాస్వామికమే.