కాపులను ఘోరంగా కించపరిచిన ఆరోపణలు ఎదుర్కొంటున్న ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డిని… కాపు జాతి నాయకుడిగా.. కాపు జాతి గౌరవం కాపాడే ప్రతినిధిగా తనను తాను ప్రకటించుకున్న ముద్రగడ వెనకేసుకు వస్తున్నారు. పవన్ కల్యాణ్ పై విరుచుకుపడ్డారు. ద్వారంపూడిని పవన్ కల్యాణ్ విమర్శించడాన్ని స్వయం ప్రకటిత కాపు జాతి నాయకుడు ముద్రగడ తట్టుకోలేకపోతున్నారు. వెంటనే మూడు పేజీల లేఖ రాసిపడేసారు.
కాకినాడ ఎమ్మెల్యే ద్వారంపూడి దొంగ అయితే రెండు దఫాలు ఎమ్మెల్యేగా ఎందుకు గెలుపొందారో ఆలోచించాలని ముద్రగడ వెనుకేసుకు వచ్చారు. గెలిస్తే దొంగ .. దొంగ కాకుండా పోతారా అన్న విషయాన్ని ముద్రగడ మర్చిపోయారు. అంతే కాదు.. ద్వారంపూడి మీద పోటీ చేయాలని కూడా ఎటకారం చేసారు. సత్తా చూపడానికి ముందుకు రావాలన్నారు. ద్వారంపూడి ఏం చేశారంటే కాపు ఉద్యమాలకు సహాయం చేశారట. అంటే రైలు తగులబెట్టే ఉద్యమంలో ద్వారంపూడి సాయం తీసుకున్నారని చెప్పకనే చెబుతున్నారు.
‘‘మీ ప్రసంగాలలో పదే పదే తొక్క తీస్తా, నార తీస్తా, క్రింద కూర్చోబెడతా, చెప్పుతో కొడతా, గుండు గీయిస్తా అంటున్నారు. ఇప్పటి వరకూ ఎంతమందికి తీయించి, క్రింద కూర్చోబెట్టారో, గుండ్లు ఎంతమందికి చేయించారో, ఎంతమందిని చెప్పుతో కొట్టారో సెలవివ్వాలి’’ అంటూ ముద్రగడ లేఖలో సెటైర్ వేశారు. అదే సమయంలో… వైసీపీ నేతలు చేసే అన్ని స్థానాల్లో పోటీ చేయడం , ముఖ్యమంత్రి అభ్యర్థి వంటి ప్రశ్నలు కూడా వేశారు.
కాపు సమాజం ఎప్పుడూ ఎందుకు వంచనకు గురవుతుందో.. ముద్రగడ లాంటి వాళ్ల నాయకులు నిరూపిస్తూనే ఉన్నారు. ఇచ్చిన రిజర్వేషన్లు తొలగిస్తే మాట్లాడని పెద్ద మనిషి.. ఇప్పుడు పవన్ కల్యాణ్ పై మాత్రం దండయాత్రకు వచ్చేశారు. ముద్రగడ కాకినాడ ఎంపీ సీటుకు .. వైసీపీ నుంచి హామీ పొందారని ఇప్పటికే అందరికీ తెలిసిపోయింది.