తెలంగాణలో “దిశ” ఘటన నిందితుల ఎన్ కౌంటర్ బూటకమని సుప్రీంకోర్టు నియమించిన సిర్పూర్కర్ కమిషన్ తేల్చింది. సుదీర్ఘంగా విచారణ జరిపిన సిర్పూర్కర్ కమిషన్… ఫేక్ ఎన్ కౌంటరని.. ప్రజల ఆగ్రహాన్ని చల్లార్చేందుకే పోలీసులు కాల్చి చంపారని నిర్ధారించింది. ఈ మేరకు ఎన్ కౌంటర్ ఘటనలో పాల్గొన్న పది మంది పోలీసు అధికారులపై హత్య కేసు నమోదు చేయాలని సిర్పూర్కర్ కమిషన్ సిఫారసు చేసింది. ఎన్ కౌంటర్ ఘటనలో మొత్తం పది మంది పోలీసులు ప్రత్యక్షంగా పాల్గొన్నారని.. అనుమానిత నిందితులను హతమార్చాలన్న ఉద్దేశంతోనే కాల్పులు జరిపారని కమిషన్ తేల్చింది.
ఈ రిపోర్టును సుప్రీంకోర్టుకు సిర్పూర్కర్ కమిషన్ సమర్పించింది. ఉదయం సుప్రీంకోర్టులో విచారణ జరిగినప్పుడు ఈ రిపోర్టును పబ్లిక్ డొమైన్లో పెట్టవద్దని తెలంగాణ ప్రభుత్వ తరపు న్యాయవాది కోరారు. అయితే దీనికి సుప్రీంకోర్టు అంగీకరించలేదు. ఈ నివేదికను తాము తెలంగాణ హైకోర్టుకు పంపుతామని.. తదుపరి విచారణ అక్కడే జరుగుతుందని ధర్మానసం తెలిపింది. నివేదికను పబ్లిక్ డొమైన్లో పెడితే ఏమవుతుందని ప్రశ్నించింది. ఆ తర్వాత నివేదిక అందుబాటులోకి వచ్చింది.
నిజానికి దిశ నిందితుల ఎన్ కౌంటర్ నిజమని ఒక్కరు కూడా అనుకోవడం లేదు. కేసీఆర్ చేయించారని గొప్పలు చెప్పుకున్నారు. అప్పటి కమిషనర్ సజ్జనార్‌కు అందరూ వీరతాళ్లు వేశారు. అప్పట్లో భావోద్వేగాలు అలా ఉన్నాయి. దిశ అనే యువతిని అంత దారుణంగా హత్య చేశారు. కానీ నిందితులు వాళ్లా కాదా … అన్నది తేలకుండా తెల్లవారక ముందే ఎన్ కౌంటర్ చేశారు. ఇలాంటి ఇన్స్టంట్ న్యాయం అందిస్తే ముందు ముందు అరాచక రాజ్యం ఏలుతుందన్న విమర్శలు అప్పట్లోనే వచ్చాయి. ఫేక్ ఎన్ కౌంటర్ అనేది ఇప్పుడు సాక్ష్యాలతో సహా నిరూపితమయింది. తదుపరి పోలీసులకు ఎలాంటి చిక్కులు వస్తాయి.. ఎన్ కౌంటర్ క్రెడిట్ పొందిన సజ్జనార్ .. ఇప్పుడు ఫేక్ ఎన్ కౌంటర్ ఫలితం కూడా అనుభవిస్తారా అన్నది వేచి చూడాలి.