ఏ సినిమాకైనా సంగీతం సగం బలం. పాటలు బాగుండాలి. ఇప్పుడైతే రీ రికార్డింగ్ కూడా అదిరిపోవాలి. మాస్ సినిమా అయితే, ఆర్.ఆర్ కి ప్రధాన భాగం ఇవ్వాల్సిందే. `అఖండ`లో తమన్ ఇచ్చిన ఆర్.ఆర్ విని అందరికీ పూనకాలు వచ్చేశాయి. రీ రికార్డింగ్‌తో మామూలు సినిమాని కూడా సూపర్ హిట్ చేయొచ్చని కొన్ని ఉదంతాలు నిరూపిస్తున్నాయి.
అయితే ఈ రీ రికార్డింగ్ లో జిమ్మిక్ ఉంది. సంగీత దర్శకులు ట్యూన్లు చేసి, దానికి పాటలు కడుతుంటారు. ఈ విషయంలో పూర్తి క్రెడిట్ వాళ్లకే ఇవ్వాలి. అయితే రీ రికార్డింగ్ అలా కాదు. దాని వెనుక ఎంతోమంది హస్తం ఉంటుంది. కొన్ని సినిమాలకు సంగీత దర్శకులు అస్సలు రీ రికార్డింగ్ చేయరని భోగట్టా. గ్రాఫిక్స్ చేయడానికి ఎలా కొన్ని సంస్థలు, స్టూడియోలు ఉన్నాయో, రీ రికార్డింగ్ చేయడానికి టాలీవుడ్, కోలీవుడ్ లలో కొన్ని గ్రూపులు ఉన్నాయి. వాళ్లతో సెట్యువేషన్ చెప్పి రీ రికార్డింగ్ చేయించుకుని, ఆ ట్రాకుల్ని సినిమాలకు వాడేస్తున్నారని తెలుస్తోంది. ఓ అగ్ర సంగీత దర్శకుడు గత రెండేళ్ల నుంచీ ఇలానే తన సినిమాలకు బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కొన్ని కంపెనీలతో చేయించుకుంటున్నాడని, ముఖ్యమైన ఎలివేషన్లకు మాత్రం ట్రాకులు తాను సిద్ధం చేస్తున్నాడని తెలుస్తోంది. ఓ సినిమాకి రీ రికార్డింగ్ చేయడానికి కనీసం 20 నుంచి 30 రోజులు కేటాయించాలి. అయితే మ్యూజిక్ డైరెక్టర్స్ దగ్గర అంత సమయం ఉండదు. చేతిలో పది సినిమాలుంటే అస్సలు కుదరదు. అందుకే ఇలా ట్రాకులు కొట్టించుకుని, వాటిని తమ సినిమాల్లో వాడుకుంటుంటారు.
మరోవైపు ట్యూన్ల విషయంలోనూ వాళ్ల ధోరణి మారింది. కొంతమంది అగ్ర దర్శకులు తమకు కావల్సినట్టుగా ట్యూన్లు రాబట్టుకుంటారు. వాళ్ల కోసం 20, 30 ట్యూన్లు చేయడానికి సిద్ధంగా ఉండే మ్యూజిక్ డైరెక్టర్లు, కొత్తవాళ్ల దగ్గర మాత్రం తమ ప్రతాపం చూపిస్తున్నారని వినికిడి. పెద్ద హీరోలు, స్టార్ డైరెక్టర్లు రిజెక్ట్ చేసిన ట్యూన్లన్నీ.. కొత్తవాళ్లకు, మరో దర్శకుడికీ అప్పగిస్తున్నారని `వాడుకుంటే వాడుకోండి.. లేదంటే లేదు` అని ఖరాఖండిగా చెబుతున్నారని, పెద్ద పేర్లున్న సంగీత దర్శకుల్ని తీసుకుంటేనే బిజినెస్ అవుతుందని గ్రహించిన నిర్మాతలు, దర్శకులు.. ఈ విషయంలో ఏమీ చేయలేక మౌనంగా ఉంటున్నారని తెలుస్తోంది.
కొంతమంది దర్శకులు మాత్రం కాస్త తెలివి తేటలు చూపిస్తున్నారట్ట. దర్శకులంతా ఓ గ్రూపుగా ఏర్పడి..`నేను ఫలానా ట్యూను రిజెక్ట్ చేశా.. మీ దగ్గరకు వస్తుందేమో చూసుకోండి` అంటూ వాట్సప్ గ్రూపుల్లో షేర్ చేసుకుంటున్నార్ట. `ఇది మీ కోసమే చేసిన ట్యూను` అని చెప్పి బురిడీ కొట్టించే ఛాన్స్ సంగీత దర్శకులకు లేకుండా చేసుకుంటున్నార్ట. అలా కాస్తో కూస్తో సంగీత దర్శకుల బద్దకానికి బ్రేకులు వేస్తున్నారు.