ఎన్నికలు అంటే.. కోట్ల ఖర్చు. ఆ కోట్లు వేళ్ల మీద లెక్క పెట్టగలిగినట్లు ఉండవు. వనరులు ఎక్కడ్నుంచి సమీకరించినా.. ఖర్చు చేయాల్సింది అభ్యర్థి కోసమే. ఇక ప్రతిష్టాత్మక బరి అయితే.. డబ్బు కన్నా నీళ్లు విలువైనవి అవుతాయి. అలాంటి నియోజకవర్గాలలో ఒకటి.. కృష్ణా జిల్లా మైలవరం. మామూలుగా అయితే… అన్ని నియోజకవర్గాల్లో ఒకటి అవుతుంది.. కానీ.. ఇక్కడ… వైసీపీ అభ్యర్థిగా ఎప్పుడైతే జగన్ వసంత కృష్ణప్రసాద్ ను రంగంలోకి దింపారో… అప్పుడే పరిస్థితి మారిపోయింది.
జగన్ పర్సనల్ టార్గెట్ దేవినేని ఉమ..!
జగన్మోహన్ రెడ్డి పర్సనల్ టార్గెట్లుగా కొంత మంది టీడీపీ నేతలను ఎంపిక చేసుకున్నారు. వారిలో మంత్రి దేవినేని ఉమ ఒకరు. ఆయన వైసీపీపై, జగన్ పై.. తీవ్ర విమర్శలతో విరుచుకుపడతారు. పోలవరం విషయంలో.. జగన్‌పై దేవినేని ఉమ చేసే విమర్శలు అన్నీ ఇన్నీ కావు. దీంతో.. ఆయనను వచ్చే ఎన్నికల్లో ఓడించాల్సిందేనని ప్లాన్ రెడీ చేసుకున్నారు. మామూలుగా దేవినేని ఉమకు ప్రత్యర్థిగా జోగి రమేష్ ఉన్నారు. ఆయన సామర్థ్యం సరిపోదని.. చివరికి… వసంత కృష్ణప్రసాద్‌ను… జగన్ ఎంపిక చేసుకున్నారు. వసంత కృష్ణప్రసాద్… వైఎస్ హయాంలో లబ్ది పొంది.. రియల్ ఎస్టేట్‌లో ఎదిగిపోయిన వ్యాపారవేత్తల్లో ఆయన ఒకరు. ఆయనకు సంబంధించిన వసంత ప్రాజెక్ట్ సంస్థపై అక్రమాస్తుల కేసులు కూడా ఉన్నాయి. ఆయన తండ్రి వసంత నాగేశ్వరరావు మాజీ హోం మంత్రి. అయితే వైఎస్ మరణం తర్వాత ఆయన కాస్త టీడీపీకి దగ్గరయ్యారు. 2014లో టీడీపీ తరపున పోటీ చేయాలనుకున్నారు కానీ.. అవకాశం దక్కలేదు. ఆ తర్వాత కూడా.. టీడీపీతోనే టచ్‌లో ఉన్నారు. చివరి ఏడాది ఆయనను గుంటూరు వెస్ట్ నియోజకవర్గంలో పని చేసుకోమని కూడా సూచించారు. అందుకు ఆయన అంగీకరించారు కూడా. కానీ ఏమైందో కానీ.. వైసీపీలోకి వెళ్లిపోయి… నేరుగా మైలవరంపై దృష్టి పెట్టారు. రంగంలోకి దిగినప్పటి నుంచి ఆయన చేసిన ఖర్చు కనీసం రూ. పాతిక కోట్లు ఉంటుందన్న అంచనాలున్నాయి.
ఎంత ఖర్చయినా ఓడించాలనేది జగన్ డైలాగ్..!
ఎన్నికల ప్రకటన రాక ముందు…డబ్బు ఖర్చుపై ఎలాంటి ఆంక్షలు లేవు. అందుకే.. ఎన్నికల ప్రకటన రాక ముందే.. ఓ విడత డబ్బు పంపిణీని… వసంత కృష్ణప్రసాద్ పూర్తి చేశారు. అయితే.. ఈ పంపిణీ ఓటర్లకు కాదు. వారిని ప్రభావితం చేయగలిగేవారికి. వైఎస్ జయంతి రోజున… నియోజకవర్గంలోని ప్రతీ మహిళకు… ఓ చీర పంపారు. నియోజకవర్గంలోని ఆటో డ్రైవర్లందరికీ… బట్టలు పెట్టి.. ఎంతో కొంత ముట్టచెప్పారు. నియోజకవర్గాల్లోని వీఆర్వోలు. ఇతర క్షేత్ర స్థాయి సిబ్బందికి కవర్లు వెళ్లాయి. చివరికి పోలీసులకు కూడా కవర్లు ఇవ్వబోయి దొరికిపోయారంటే.. పంపిణీ ఎలా సాగిందో అర్థం చేసుకోవచ్చు. ఓ సందర్భంలో.. ఓ వీఆర్వో… కృష్ణప్రసాద్ తండ్రి.. గెలవడానికి..కోట్లే కాదు..కడప నుంచి మనుషుల్ని తెప్పించి మర్డర్లు చేయడానికైనా వెనుకాడమని హెచ్చరించడం ఆ నియోజకవర్గంలో ఉన్న పరిస్థితిని తెలియజేస్తోంది.
మైలవరం ఎన్నికల బడ్జెట్ రూ. 50 కోట్ల పైనేనా..?
టీడీపీ ద్వితీయ శ్రేణి నేతలతో రహస్యంగా బేరసారాలు కుదుర్చుకున్నారు. టీడీపీ గట్టి పట్టు ఉన్న ఓ గ్రామంలో… ఓ గ్రామస్థాయి టీడీపీ నాయకుడికి ఏకంగా రూ. కోటిన్నర ఇచ్చి పార్టీలో చేర్చుకున్నట్లు చెబుతున్నారు. మరోవైపు మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు… కృష్ణప్రసాద్ చేస్తున్నంతగా ఖర్చు పెట్టకపోయినా… ప్రభుత్వ సంక్షేమ పథకాలు… మాత్రం… ప్రతి ఒక్కరికీ అందేలా జాగ్రత్తలు తీసుకున్నారు. వైసీపీలోని అసంతృప్తులకి మంచి అవకాశాలిస్తామని చెప్పి.. పార్టీలో చేర్చుకుంటున్నారు. వైసీపీ యువజన జిల్లా అధ్యక్షుడుగా పని చేసిన కాజా రాజ్‌కుమార్ టీడీపీలో చేరారు. ఆయనకు మైలవరం, రెడ్డిగూడెం మండలాల్లో పట్టుంది. ఇప్పటి వరకూ జరిగిన ఖర్చు ఒక ఎత్తు అయితే… ఎలక్షనీరింగ్ కోసం చేయాల్సిన ఖర్చు అంతకు రెండు, మూడు రెట్లు ఎక్కువే ఉండే అవకాశం ఉంది. ఎంత బాగా చేసినా.. ఖర్చు విషయంలో వెనుకాడితే మొత్తానికే మోసం వస్తుందన్న భయంతో.. దేవినేని ఉమ కూడా.. ఖర్చుకు వెనుకాడలేని పరిస్థితి. ఆయన ఇప్పటి వరకూ భారీ పరిశ్రమ మంత్రిగా ఉన్నారు కాబట్టి.. ఆయన కోసం.. కాంట్రాక్టర్లు ముందుకొస్తున్నారని చెబుతున్నారు. మొత్తానికి అసెంబ్లీ ఎన్నికల్లో ఖర్చు ఎక్కువగా ఉండే నియోజకవర్గాల్లో మైలవరం ఒకటి కానుంది.