ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇలా జీవో ఇవ్వగానే అలా టాలీవుడ్ మొత్తం వరుస పెట్టి ఏపీ ప్రభుత్వానికి ధ్యాంక్సులు చెప్పుకోవడానికి క్యూ కట్టారు. సోషల్ మీడియాలోనూ చెప్పారు. చాంబర్ ప్రతినిధులమంటూ కొంత మంది ప్రెస్ మీట్ పెట్టి ఏకంగా సన్మానం చేస్తామన్నారు. దీంతో ఈ ఇష్యూని ఫాలో అవుతున్న అందరూ ఆశ్చర్యపోవాల్సి వచ్చింది. చివరికి జనసేన నేత నాదెండ్ల మనోహర్ కూడా అదే ప్రశ్నించారు. సీఎం జగన్కు సన్మానం చేస్తామంటున్నారని.. ఏం మేలు చేశారో చెప్పాలన్నారు. ఇప్పటికైనా పోరాటం నేర్చుకోవాలని ఆయన ఇండస్ట్రీకి సలహా ఇచ్చారు.
నాదెండ్ల మనోహర్ అన్నారని కాదు కానీ.. జీవో నెం.35ని రద్దు చేసి విడుదల చేసిన కొత్త జీవో వల్ల తెలుగు సినీ పరిశ్రమకు కొత్తగా వచ్చిన మేలు ఏమైనా ఉందా..? ఉంటే ఒకటి చెప్పండని ఎవరైనా అడిగితే.. ఎవరికీ నోరు రావడం లేదు. గతంలో ఉన్న సౌకర్యాలను కూడా పరిమితులతో ఇచ్చారు. కొత్తగా ఇరవై శాతం షూటింగ్ నిబంధన పెట్టారు. బడ్జెట్ ఎలా లెక్కలేస్తారో తెలియకుండానే టిక్కెట్ రేట్ల పెంపునకు షరతు పెట్టారు. ఇంకా చెప్పాలంటే.. తెలంగాణతో పోలిస్తే.. ఏపీలో ఇంకా ఎన్నో ఇబ్బందులు ఉన్నట్లే లెక్క. అయినా చచ్చినోడి పెళ్లికి వచ్చిందే కట్నం అన్నట్లుగా కొంత మంది సాష్టాంగ ప్రమాణాలు చేసేందుకు సిద్ధమైపోవడం..అందర్నీ ఆశ్చర్యపరుస్తోంది.
పవన్ కల్యాణ్ సినిమాను దెబ్బతీయడానికి జీవోను ఆలస్యం చేశారని చిన్న పిల్లవాడికైనా తెలుస్తుంది. అప్పుడు ఒక్కరంటే ఒక్కరూ మాట్లాడలేదు.కానీ జీవో రాగానే అందరూ వరుస పెట్టి… ధ్యాంక్సులు చెప్పడం ప్రారంభించారు. చిన్నపాటి మేలు కోసం ఇండస్ట్రీ ఆత్మగౌరవాన్ని ప్రభుత్వం వద్ద తాకట్టు పెట్టారన్న అభిప్రాయానికి వస్తున్నారు. టిక్కెట్ రేట్ల తగ్గింపు వల్ల ప్రభుత్వానికీ నష్టమే. ఇండస్ట్రీకే్ కాదు. అయినా టాలీవుడ్ నేతలు ఏ మాత్రం వెన్నుముక లేకుండా వ్యవహరించారన్నఅభిప్రాయం వినిపిస్తోంది. అయితే… ఇంకా ఎక్కువ మాట్లాడితే తమ వ్యాపారాలన్నీ దెబ్బకొడతారని భయపడి ఉంటారని.. ఎక్కువ మంది అనుకుంటున్నారు.