జనసేన ముఖ్య నేత నాదెండ్ల మనోహర్ .. తెలుగుదేశం పార్టీతో పొత్తుల దిశగానేచర్చలు సాగుతున్నాయని పరోక్షంగా తేల్చి చెప్పారు. జనసేన అధినేత పవన్ కల్యాణ్.. చంద్రబాబు ఇంటికి వెళ్లి చర్చలు జరిపారని రెండు పార్టీలు ప్రకటించాయి కానీ ఏ అంశాలపై అన్నదానిపై మాత్రం స్పష్టత లేదు. సమావేశం తర్వాత ఎవరూ మీడియాతో మాట్లాడలేదు. ఈ అంశంపై ఉత్తరాంధ్ర పర్యటనలో నాదెండ్ల మనోహర్ ఈ అంశంపై స్పందించారు.
వైసీపీ విముక్త ఆంధ్రప్రదేశ్ అనేది మా నినాదమని.. నిన్న చంద్రబాబుతో పవన్ చర్చల్లో ఇదే కీలక అంశమని స్పష్టం చేశారు. భవిష్యత్‌లో మరిన్ని చర్చలుంటాయి.. మంచి ప్రణాళిక, వ్యూహంతో జనసేన అడుగులు వేస్తుందన్నారు. సీఎం జగన్ పట్ల ప్రజల్లో నమ్మకం పోయింది.. రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ ఫెయిల్ అయ్యిందన్నారు. బీజేపీతో పొత్తు విషయంపై మాత్రం నాదెండ్ల మాట్లాడలేదు. ఇటీవల ఢిల్లీకి వెళ్లిన పవన్, నాదెండ్ల బీజేపీ హైకమాండ్‌తో చర్చలు జరిపారు. ఆ తర్వాత కొన్ని రోజులు సైలెంట్ గా ఉన్నారు. ఇప్పుడు చంద్రబాబును కలవడంతో రాజకీయంగా మళ్లీపొత్తు చర్చలు ప్రారంభమయ్యాయి.
ఓ వైపు బీజేపీ ప్రతీ రోజూ తాము జనసేనతోనే కలిసి ఉన్నామని చెబుతోంది. ఎన్నికల్లో కలిసి పోటీ చేస్తామని చెబుతున్నారు. కానీ జనసేన వైపు నుంచి అటువంటి ప్రణాళికలు రావడం లేదు. ఇటీవల ప్రధాని మోదీని చంద్రబాబు పొగిడారు. ఎన్డీఏలో చేరడంపై కాలం నిర్ణయిస్తుందన్నారు. ఈ వ్యాఖ్యల నడుమ .. చంద్రబాబు, పవన్ చర్చలు ఆసక్తికరంగా మారాయి.