కల్కిలో ప్రభాస్ ని జోకర్‌గా చూపించారన్న అర్షద్ వార్సి కామెంట్లు దుమారం రేపుతున్నాయి. అర్షద్ కేవలం పబ్లిసిటీ కోసమే… ప్రభాస్ పేరెత్తాడని టాలీవుడ్ ధీటుగా స్పందిస్తోంది. నాని, శర్వానంద్, సుధీర్‌బాబు తదితర కథానాయకులు డైరెక్ట్ గానే అర్షద్ వార్సీపై విమర్శనా బాణాలు ఎక్కు పెట్టారు. ‘మా’ కూడా దీనిపై స్పందించింది. విమర్శించేటప్పుడు పదాలు కాస్త జాగ్రత్తగా వాడాలంటూ అర్షద్ కు బుద్ధి చెప్పింది. ఇప్పుడు ఈ విషయంపై ‘కల్కి’ దర్శకుడు నాగ్ అశ్విన్ స్పందించారు. ఈ సందర్భంగా ఎక్స్ ఖాతాలో తాను చేసిన ట్వీట్ హాట్ టాపిక్‌గా మారింది.
చిత్రసీమను వెనక్కి లాకెళ్లొద్దని, టాలీవుడ్ – బాలీవుడ్ అనే సరిహద్దులు చెరిగిపోయాయని, దేశం మొత్తం ‘సినిమా’ ఒక్కటే అని, ఆ దృష్టితోనే చిత్రసీమని చూడాలని నాగ్ అశ్విన్ ట్వీట్ చేశారు. అర్షద్ విమర్శ కాస్త హుందాగా ఉంటే బాగుండేదని, ఆయన పదాల్ని మరింత మెరుగ్గా ఉపయోగించాల్సిందని అభిప్రాయపడ్డారు. ‘కల్కి 2’ కోసం మరింత కష్టపడతానని, `కల్కి 2`లో ప్రభాస్ పాత్ర మరింత గొప్పగా, ఉన్నతంగా ఉంటుందని అభిమానులకు మాట ఇచ్చాడు. అర్షద్ పిల్లలకు ‘బుజ్జి టాయ్స్‌ని’ పంపుతానని పేర్కొనడం కొసమెరుపు. ఒకరి విమర్శని నాగ్ అశ్విన్ హుందాగా తీసుకోవడం, అర్షద్ పిల్లలకు బొమ్మలు బహుమతిగా పంపిస్తానని చెప్పడం.. నాగ్ అశ్విన్‌పై మరింత గౌరవాన్ని కలిగిస్తున్నాయి. ఈ వివాదాన్ని నాగ్ అశ్విన్ పుల్ స్టాప్ పెట్టడానికే చూస్తున్నాడు. మరోవైపు బాలీవుడ్ కూడా అర్షద్ వ్యాఖ్యల్ని సమర్థించలేకపోతోంది. తోటి నటుడ్ని విమర్శించడం తగదని అర్షద్‌కు హితవు పలుకుతోంది. అర్షద్ అనే కాదు, టాలీవుడ్ – బాలీవుడ్ అంటూ విడగొట్టి మాట్లాడేవాళ్లకు, ప్రాంతీయ సినిమాను చిన్న చూపు చూసేవాళ్లకు గట్టిగా బుద్ది చెప్పాల్సిందే. అప్పుడు గానీ ఈ వివక్ష తగ్గదు.