నాగశ్రీను అనే వ్యక్తి కుటుంబాన్ని తన దగ్గరకు పిలిపించుకున్న నాగబాబు ఓదార్చారు. అండగా ఉంటానని చెప్పారు. అంతే కాదు…రూ. యాభై వేల సాయం చేశారు. ఇంతకీ ఈ నాగ శ్రీను ఎవరంటే .. తమ ఆఫీసులో రూ. ఐదు లక్షల విలువైన హెయిర్ డ్రెస్సింగ్ సామాగ్రి కొట్టేశారని మంచు విష్ణు పోలీసు కేసు పెట్టిన వ్యక్తి. మంచు కుటుంబం వద్ద పదేళ్ల పాటు పని చేసిన వ్యక్తి. అక్కడేం జరిగిందో తెలియదు కానీ మంచు విష్ణు కేసు పెట్టడం.. తర్వాత నాగశ్రీను మీడియా ముందుకు వచ్చి మోహన్ బాబు కుటుంబంపైనే ఆరోపణలు చేయడం కలకలం రేపింది. ఆయన సీసీ కెమెరా ఫుటేజీలు బయట పెట్టాలంటున్నారు.
ఈ వివాదంలో పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారో స్పష్టత లేదు కానీ మోహన్ బాబు చుట్టూ కొత్త వివాదం ప్రారంభమయింది. కులం పేరుతో తిట్టారంటూ నాగశ్రీను చేసిన వ్యాఖ్యలపై బీసీ సంఘాల పేరుతో రాజకీయం చేసుకునే కృష్ణయ్య తెరపైకి వచ్చారు. మోహన్ బాబు వైసీపీ నాయకుడైనా సరే.. తనకు వైసీపీ మీద అభిమానం ఉన్నా సరే ఆయన తగ్గలేదు. క్షమాపణ చెప్పకపోతే మోహన్ బాబు సంగతి చూస్తామన్నారు. ఆ కుల సంఘాల వివాదం అలా ఉండగానే ఇప్పుడు నాగశ్రీనుకు ఇండస్ట్రీలోనే మెగా క్యాంప్ అండ దొరికింది.
నాగబాబు పిలిచి ఆర్థిక సాయం చేశారంటే.. అది మోహన్ బాబు మీద ప్రత్యేకంగా రివెంజ్ తీర్చుకోవడానికేనని ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. తాము అండగా ఉంటామని చెప్పారు. ఈ ఉత్సాహంతో నాగశ్రీను మరిన్ని ఆరోపణలు చేయవచ్చు. అయితే ఈ అంశంపై మోహన్ బాబు ఫ్యామిలీ వెర్షన్ ఏంటో ఇంత వరకూ బయటకు రాలేదు. వారెవరూ స్పందించడం లేదు. వివాదాల పాలవుతున్నా ఒక్క మాట మాట్లాడటం లేదు. ఇప్పుడు కూడా మాట్లాడకపోతే మరింత బద్నాం అయిపోతారు. అందుకే మోహన్ బాబు.. మెగా ఫ్యామిలీపై మరోసా రి ఎటాక్ చేసే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. దీనికి నాగశ్రీను వ్యవహారమే కీలకమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. మోహన్ బాబు – నాగశ్రీను వివాదంలో నాగబాబు ఎంటర్ కావడమే దీనికి కారణం అని ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.