వచ్చే ఎన్నికల్లో తమ కుటుంబం నుంచి పవన్ కల్యాణ్ మాత్రమే పోటీ చేస్తారని ఇంకెవరూ పోటీ చేయరని జనసేన పీఏసీ సభ్యుడు, పీకే సోదరుడు నాగబాబు ప్రకటించారు. తాను పూర్తిగా పార్టీ సేవకే అంకితమవుతానన్నారు. పార్టీ కార్యకర్తలను ఎన్నికలకు సమాయత్తం చేసేందుకు ఆయన ప్రస్తుతం ఉత్తరాంధ్రలో పర్యటిస్తున్నారు. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ జిల్లాల్లో ఆయన పర్యటించారు. ఈ సందర్భంగా విశాఖలో మీడియాతో మాట్లాడుతూ తాను పోటీ చేయని విషయాన్ని ప్రకటించారు.
పవన్ కల్యాణ్ పాదయాత్రతో సమానమైన యాత్రను చేపట్టడానికి సన్నాహాలు చేసుకుంటున్నారని చెబుతున్నారు. చిరంజీవి మద్దతు పూర్తి స్థాయిలో జనసేనకే ఉంటుంది కానీ ఆయన రాజకీయాల్లోకి వచ్చే ఉద్దేశంలో లేరని.. ఆయన పూర్తిగా సినిమాలకే అంకితమయ్యారని నాగబాబు చెబుతున్నారు. ఈ విషయంలో చిరంజీవి మనసు మార్చుకునే అవకాశం కూడా లేదని చెబుతున్నారు. నాగబాబు గత ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత జనసేన తరపున పెద్దగా కార్యక్రమాల్లో పాల్గొనలేదు. ఇటీవలి కాలంలో చొరవ తీసుకుంటున్నారు.
గతంలో కూడా ఆయన నేరుగా జనసేనలో ఎలాంటి కార్యక్రమాలు చేపట్టకపోయినా… టిక్కెట్ ఇచ్చారు. నర్సాపురం లోక్ సభ స్థానం నుంచి పోటీ చేశారు. కానీ మూడో స్థానంలో నిలిచారు. ఆయన వ్యవహారశైలి .,. వ్యాఖ్యల వల్ల పార్టీకి నష్టం జరిగిందన్న అభిప్రాయం అప్పట్లో వినిపించింది. ఈ సారి ఎందుకైనా మంచిదని ఆయన పోటీకి దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నట్లుగా కనిపిస్తోంది.