గత రెండు నెలలుగా నాగబాబు సోషల్ మీడియాలో వేర్వేరు అంశాల మీద తన స్పందన వ్యక్తం చేస్తూ వీడియోలు విడుదల చేస్తున్నాడు. బాలకృష్ణ గతంలో పవన్ కళ్యాణ్ మీద , చిరంజీవి మీద చేసిన అభ్యంతరకర వ్యాఖ్యల మీద విడుదల చేసిన ఆరు వీడియోలు కూడా వైరల్ అయ్యాయి. ఆ తర్వాత అడపాదడపా కొన్ని వీడియోలు విడుదల చేసినప్పటికీ అవి పెద్దగా వైరల్ కాలేదు కానీ ఇప్పుడు ఏబీఎన్ రాధాకృష్ణ చేస్తూ నాగబాబు చేసిన వీడియో సోషల్ మీడియాలో తెగ చక్కెర్లు కొడుతుంది. ఏబీఎన్ ఛానల్ లో, ప్రసారం చేసిన ఒక కథనంలో లోకేష్ ని మరీ ఆకాశానికి ఎత్తేస్తూ, ప్రధానమంత్రి మోడీ మరే పని లేనట్టుగా ఆంధ్రప్రదేశ్ కి వస్తున్న నిధులను ఆపడం మీదే పూర్తి శక్తి కేంద్రీకరిస్తున్నారు అని ప్రచారం చేస్తూ, అయినా కూడా బిజినెస్ పీపుల్ అంతా ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులు పెట్టడానికి ఎగబడుతున్నారు అన్నట్టుగా ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ఛానల్ ఒక కథనాన్ని ఆమధ్య ప్రసారం చేసింది. ఇప్పుడు ఈ కథనం మీద వ్యంగ్య బాణాలు సంధిస్తూ నాగబాబు ఒక వీడియో చేశారు. ఆ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది.
ఆంధ్రజ్యోతి ప్రసారం చేసిన కథనం:
ఇంతకీ ఆంధ్రజ్యోతి ప్రసారం చేసిన కథనం ఏమిటంటే, ఆ మధ్య దావోస్ లో జరిగిన ఆర్థిక సదస్సు కు మంత్రి లోకేష్ హాజరయ్యారు. గత నాలుగు సందర్భాల్లో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఈ సదస్సుకు హాజరైనప్పటికీ ఈ సారి పార్టీ వ్యవహారాల తో బిజీగా ఉండడం వల్ల లోకేష్ ని అక్కడికి పంపించారు. అయితే ఆంధ్రజ్యోతి కథనం ప్రకారం అక్కడ లోకేష్ కు ఒక ఆశ్చర్యకరమైన అనుభవం ఎదురైంది.
అపర కుబేరుడు అయిన ఒక బిజినెస్ మాన్ అక్కడ లోకేష్ తో భేటీ అయ్యారు. ఆయన కొన్ని వేల కోట్లు ఆంధ్ర ప్రదేశ్ లో పెట్టుబడి పెట్టడానికి సంసిద్ధత వ్యక్తం చేశారు. అయితే ఆయన చెప్పిన విషయం ఏమిటంటే, తాను ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులు పెట్టడానికి వస్తుండగా ప్రధానమంత్రి మోడీ ఆయనను భేటీకి ఆహ్వానించారు. ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులు పెట్టడానికి తాను సిద్ధపడుతున్నానని మోడీకి చెప్పగానే మోడీ అక్కడ బదులు గుజరాత్ లో పెట్టుబడి పెట్టండి అని, కావాలంటే మీకు అన్ని రకాల వసతులు ఏర్పాటు చేస్తామని, అహ్మదాబాద్ కి వెళ్లడానికి విమాన సర్వీసులు కూడా బాగున్నాయని మోడీ ఆ బిజినెస్ మ్యాన్ తో అన్నాట్ట. అయితే, ఆయన ఆంధ్రప్రదేశ్ లో నే పెట్టుబడి పెట్టాలని నిర్ణయించుకున్నాడని, అందుకు కి చంద్రబాబు నాయుడు బ్రాండ్ ఇమేజ్ కారణం అని, ఆంధ్రజ్యోతి కథనం ప్రసారం చేసింది.
ఆంధ్రజ్యోతి కథనం పై నాగబాబు చెణుకులు
అయితే ఆంధ్రజ్యోతి ప్రసారం చేసిన కథనం పై నాగబాబు సెటైర్లు వేశారు. లోకేష్ ని ఆకాశానికెత్తుతూ ప్రసారం చేసిన కథనం మొదలవగానే వచ్చే దద్దరిల్లి పోయే రీరికార్డింగ్ సౌండ్ చూస్తూ, “ఆహా ఇది ఆర్ ఆర్ అంటే, ఇలా ఉండాలి” అంటూ వెటకారం చేశారు. అలాగే ఆంధ్రప్రదేశ్ కు వచ్చే పెట్టుబడులను పనిగట్టుకుని మోడీ నిలిపేస్తున్నాడు అన్న వ్యాఖ్యలపై కూడా “మోడీ గారికి మరియు పని లేనట్టుగా ఆంధ్రప్రదేశ్ కు వచ్చే పెట్టుబడి లన్ని ఆపేయడం బాగోలేదు ” అంటూ వెటకారంగా స్పందించారు. అలాగే మోడీ ని కాదని సైతం పెట్టుబడిదారులు అందరూ చంద్రబాబు బ్రాండ్ ఇమేజ్ కారణంగా వేల కోట్లు ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులు పెడుతున్నారు అన్న వ్యాఖ్యలపై స్పందిస్తూ, “అబ్బా సూపర్, అసలు ఇంత గొప్పగా ఉంటే ఇంకా స్పెషల్ స్టేటస్ కోసం చంద్రబాబు అంత పాకులాడాల్సిన అవసరం కూడా లేదు ఏమో” అంటూ చెణుకులు విసిరారు.
అన్నింటికంటే ముఖ్యంగా, “ఇంత పెద్ద కథనాన్ని ప్రసారం చేసిన ఆంధ్రజ్యోతి ఇంతకీ ఆ అపర కుబేరుడు అయిన బిజినెస్ మాన్ పేరేమిటో ఎందుకు చెప్పలేదబ్బా ” అంటూ అసలు ఆంధ్రజ్యోతి ప్రసారం చేసిన కథనం మొత్తం ఫేక్ ఏమో అన్న అనుమానాలు రేకెత్తించేలా సెటైర్ వేశారు. వీటికి తోడు ఆంధ్రజ్యోతిలో వాయిస్ ఓవర్ లోకేష్ ని చంద్రబాబు ని విపరీతంగా పొగుడుతున్న ప్పుడల్లా ఆ వ్యాఖ్యలకు తాను కూడా తాళం వేస్తూ నవ్వులు పూయించారు.
మొత్తం మీద
మొత్తం మీద నాగబాబు చేసిన ఈ వీడియో సరదా గా ఉండడమే కాకుండా ఆంధ్రజ్యోతి ఛానల్ వేసే విపరీత అతిశయోక్తుల మీద సెటైర్ గా ఉండడంతో వీడియో వైరల్ అవుతుంది.
Zuran (@CriticZuran)