నాగశౌర్య నుంచి ఓ సినిమా కబురు వినిపించి చాలాకాలమైంది. `రంగబలి` తరవాత శౌర్య సినిమా ఏదీ రాలేదు. ఓ సినిమా పట్టాలెక్కింది. కానీ ఇప్పుడు ఆగిపోయింది. దర్శకుడు, నిర్మాత మధ్య వచ్చిన క్రియేటీవ్ డిఫరెన్సెన్స్ వల్ల సినిమాకు బ్రేక్ పడింది. ఓ ఎన్.ఆర్.ఐ నిర్మాత నాగశౌర్యతో సినిమా చేద్దామనుకొన్నాడు. అరుణాచలం అనే కొత్త దర్శకుడికి అవకాశం ఇచ్చాడు. సంగీత దర్శకుడిగా హారీశ్ జైరాజ్, కెమెరామెన్‌గా వెట్రిలను ఎంచుకొన్నారు. ప్యాడింగ్ కూడా బాగానే ఉంది. 12 రోజులు షూటింగ్ చేశారు. అడ్వాన్సులతో కలిసి దాదాపు రూ.12 కోట్ల లెక్క తేలింది. ఆ తరవాత దర్శకుడికీ, నిర్మాతకూ మధ్య క్లాష్ వచ్చింది. సినిమా ఆగిపోయింది. ఇప్పుడు ఈ పంచాయితీ ఛాంబర్ వరకూ వెళ్లింది. ఈ సినిమా నేను చేయలేను అని సదరు ఎన్.ఆర్.ఐ నిర్మాత చేతులు ఎత్తేసినట్టు టాక్. దాంతో మరో నిర్మాత రంగ ప్రవేశం చేయాల్సివచ్చింది. ఇప్పుడు రూ.12 కోట్లకు సెటిల్మెంట్ చేయాల్సిన పరిస్థితి వచ్చిందని తెలుస్తోంది.
Read More : నాగశౌర్యకు ఏమైంది..?
12 రోజుల షూటింగ్ కి అయిన ఖర్చు తక్కువే. కానీ కథా చర్చలని, మ్యూజిక్ సిట్టింగ్స్ అని రోజుల తరబడి స్టార్ హోటెల్స్ లో కూర్చుని లక్షలకు లక్షలు బిల్లులు చేశారు. అవన్నీ తడిసి మోపెడు అయ్యింది. ఈ లెక్కలు ఎంతకీ తేలడం లేదు. మంచి కథ కోసం వెదుకుతున్న నాగశౌర్యకు అలాంటి కథ దొరికినా, ఎందుకో గ్రహణం వీడడం లేదు. వరుస పరాజయాల తరవాత ఆచి తూచి ఎంచుకొన్న సినిమా కాస్త ఇప్పుడు పంచాయితీ వరకూ వెళ్లింది. ఈ గొడవ ఎప్పుడు తేలుతుందో ఏంటో?