హీరోలకూ, హీరోయిన్లకూ సవాల్ విసిరే పాత్రలు కొన్ని వస్తుంటాయి. అలాంటప్పుడే సత్తా బయటపెట్టాలి. ఆడుతూ, పాడుతూ చేసుకుంటూ పోయే పాత్రలు, సినిమాలు హిట్టయితే సంతృప్తి దొరుకుతుంది. కానీ కష్టపడి పనిచేసి, చమట చిందించే పాత్రలకు – ప్రేక్షకుల గుర్తింపు దక్కితే చాలు. ఆత్మ సంతృప్తి దొరికేస్తుంది. అలాంటి పాత్ర నాగశౌర్యకు `లక్ష్య`తో దక్కినట్టు కనిపిస్తోంది. నాగశౌర్య విలుకాలుడిగా నటించిన చిత్రం లక్ష్య. ఈనెల 10న విడుదల అవుతోంది. ఈ సినిమా ట్రైలర్ ఇటీవలే బయటకు వచ్చింది. ఇందులో నాగశౌర్య 8 ప్యాక్‌లో ఆశ్చర్య పరిచాడు. ఎప్పుడూ, ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్, ప్రేమ కథలు చేసే శౌర్య. ఈసారి స్పోర్ట్స్ డ్రామా నేపథ్యంలో కథ ఎంచుకున్నాడు. ఇందులో తన లుక్… చాలా కొత్తగా, ప్రత్యేకంగా కనిపిస్తోంది. ముఖ్యంగా 8 ప్యాక్‌లో షాకింగ్ లుక్‌లో కనిపించాడు. 8 ప్యాక్ అంటే మాటలు కాదు. శరీరాన్ని చాలా కష్టపెట్టాల్సివస్తుంది. డైట్ మొత్తం మారిపోవాలి. అందుకోసం శౌర్య దాదాపు ఆరు నెలల పాటు ఒళ్లు వంచి, హూనం చేసుకున్నాడు. షూటింగ్ కి మూడు రోజుల ముందు నుంచీ కనీసం నీళ్లు కూడా ముట్టలేదు.
”పార్థు అనే పాత్రను నాగ శౌర్య నెక్స్ట్ లెవెల్‌కు నాగ శౌర్య తీసుకెళ్లారు అన్నారు సంతోష్. విలుకాడికి సిక్స్ ప్యాక్ అవసరమా? అని అంతా అన్నారు. కానీ విల్లు ఎంత ఫ్లెక్సిబిలిటీగా ఉంటుందో అలా బాడీ కూడా ఉండాలి. మూడు రోజులు కనీసం పచ్చి మంచినీళ్లు కూడా ముట్టుకోలేదు. కనీసం ఆయన ఉమ్ము కూడా మింగలేదు. 8 ప్యాక్ కోసం మూడు రోజులు అలానే ఉండిపోయారు” అని ఈ చిత్ర దర్శకుడు సంతోష్ జాగర్లమూడి చెప్పుకొచ్చారు. `వరుడు కావలెను`తో ఓ డీసెంట్ హిట్ అందుకున్న శౌర్యకు… లక్ష్య తో ఇమేజ్ మారే అవకాశాలు పుష్కలంగా కనిపించనున్నాయి.