కొడాలి నాని, వెల్లంపల్లిలను హీరోలుగా పెట్టి సినిమాలు తీయాలని వారు ఇండస్ట్రీలో ఉన్న హీరోల కంటే ఎక్కువగా నటించగలరని ఏపీ సీఎం జగన్‌కు చిరు బ్రదర్ నాగబాబు సలహా ఇచ్చారు. తన సోదరుడు సినిమాపై ఏపీ ప్రభుత్వం కక్ష సాధిస్తున్నా… హీరోలు మాట్లాడటం లేదంటూ ఆయన విమర్శలు చేశారు. దానిపై..హీరోలు సరే.. మీరెందుకు మాట్లాడలేదన్న కౌంటర్లు రావడంతో నాగబాబు స్పందించారు. ఏపీ ప్రభుత్వాన్ని పద్దతిగా విమర్శిస్తూ సుదీర్ఘమైన వీడియో తీశారు. ఇప్పుడు ఏపీ ప్రభుత్వంలో సినిమాల గురించి మాట్లాడుతున్న ఎవరికీ పరిశ్రమపై అవగాహన లేదని స్పష్టం చేశారు. వారి గురించి మాట్లాడటం దండగన్నారు.
ఏపీలో అన్ని వ్యాపారాలను చేతుల్లోకి తీసుకుంటున్నట్లుగానే సినిమా ఇండస్ట్రీని కూడా తీసుకోవాలని.. అక్కడ టాలీవుడ్ సినిమాలను బ్యాన్ చేసి.. కొడాలి, వెల్లంపల్లిలనుపెట్టి సినిమాలు తీసి రిలీజ్ చేయాలని సలహా ఇచ్చారు.సినిమా బడ్జెట్లో హీరోల రెమ్యూనరేషన్ భాగం కాదన్న వారి గురించి ఏం మాట్లాడతామని ప్రశ్నించారు. చిరంజీవి పెద్ద మనిషిగా వచ్చి ఇండస్ట్రీ కోసం మాట్లాడారని.. అయినా జీవో ఇవ్వలేదని ఇప్పుడు తాము వచ్చి బతిమాలాలా అని ప్రశ్నించారు. అది ఇప్పటికీ జరగదన్నారు. కొడాలి నాని మరింత స్మార్ట్‌గా చిరంజీవిని పవన్ కల్యాణ్ విమర్శించారంటూ చేసిన వ్యాఖ్యలపైనా నాగబాబు కౌంటర్ ఇచ్చారు. మా సోదరుల మధ్య గొడవలు పెట్టే దమ్ముందా అని ప్రశ్నించారు.
జగన్ పరిపాలనకు ఇంకా రెండేళ్లు మాత్రమే ఉందని ఓసారి జనంలోకి వచ్చి పరిపాలన ఎలా ఉందో తెలుసుకోవాలని జగన్‌కు నాగబాబు సలహా ఇచ్చారు. ఏమైనా విమర్శిస్తే మంత్రులు బూతులతో విరుచుకుపడుతున్నారని కానీ తాము అలా మాట్లాడలేమన్నారు. తెలంగాణ ప్రభుత్వం నుంచి కొంతైనా సాయం అందుతోంది కానీ ఏపీ మాత్రం ఇబ్బందులు పెడుతోందని నాగబాబు అసహనం వ్యక్తం చేశారు. పవన్ కల్యాణ్ ఎలాంటి విమర్శలు చేసినా విరుచుకుపడే మంత్రులు.. ఇప్పుడు నాగబాబుపై ఎలాంటి కౌంటర్లు వేస్తారో చూడాలి.