ప్రభుత్వ యంత్రాంగమంతా వరద సహాయక చర్యలో నిమగ్నమై పని చేస్తుంటే..ఈ సహాయక చర్యల్లో సర్కార్ ఫెయిల్ అయిందంటూ మాజీ మంత్రి రోజా చేసిన వ్యాఖ్యలపై టీడీపీ ఎమ్మెల్యే గాలి భాను ప్రకాష్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ప్రభుత్వ సహాయక చర్యలపై ప్రజల నుంచి సైతం ప్రశంసలు వస్తుంటే రోజా మాత్రం విమర్శలు చేయడం ఆమె విజ్ఞతకే వదిలేస్తున్నానని అన్నారు.
భారీ వర్షాల కారణంగా వరదలు ముంచెత్తడంతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ సమయంలో రాజకీయాలు మాని, సహాయక చర్యలు చేపట్టేందుకు ముందుకు రావాల్సిన వైసీపీ నేతలు విమర్శలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వరద సహాయక చర్యలపై రోజా ఏం మాట్లాడుతుందో ఆమెకే తెలియాలన్నారు.
ఆడుదాం – ఆంధ్రా పేరుతో కోట్లాది రూపాయల ప్రజా ధనం దుర్వినియోగం చేశారని ఆరోపించారు. రూ.350లు విలువ చేసే బ్యాట్లను 3500 , 6500కొనుగోలు చేసినట్లు చూపించారన్నారు. ప్రజల సొమ్మును దోచుకునేందుకే ఆడుదాం ఆంధ్రా కార్యక్రమాన్ని చేపట్టారన్నారు. అవినీతి , అక్రమాలకు పాల్పడిన నేతల బాగోతం త్వరలోనే బయటకు వస్తోందని హెచ్చరించారు.
రోజా మాత్రమే కాదు.. వైసీపీ హయాంలో అవినీతికి పాల్పడిన ఎవరిని కూటమి ప్రభుత్వం వదలబోమని, తప్పు చేసిన వారు చిప్పకూడు తినాల్సిందేనన్నారు ఎమ్మెల్యే గాలి భాను ప్రకాష్.