ఈరోజు జరిగిన నాగార్జున – జగన్‌ల భేటీ అటు చిత్రసీమలోనూ, ఇటు రాజకీయ వర్గాలలోనూ ఆసక్తిని రేకెత్తించింది. లోటస్ ఫాండ్లో జగన్‌ని కలిసిన నాగ్… దాదాపు అరగంట సేపు చర్చించారు. దాంతో నాగార్జున వైకాపాలో చేరబోతున్నట్టు వార్తలు ఊపందుకున్నాయి. ఆయన గుంటూరు టికెట్ కోసం ప్రయత్నిస్తున్నట్టు ఊహాగానాలు వ్యాపించాయి. అయితే ఓవర్గం మాత్రం నాగార్జున వైకాపాలో చేరడం లేదు, తన మిత్రుడికి గుంటూరు టికెట్ ఇప్పించడానికి ఆయన రాయబారిగా వచ్చారని చెప్పుకొచ్చాయి.
వీటిపై నాగ్ క్లారిటీ ఇచ్చేశాడు. తను రాజకీయాల్లో చేరడం లేదని ఆయన మరోసారి కుండ బద్దలు కొట్టేశారు. ప్రజా సంకల్ప యాత్ర విజయవంతంగా పూర్తి చేసుకుని వచ్చినందుకు తాను అభినందించడానికే జగన్‌ని కలిశానని చెప్పారు నాగ్. తమ మధ్య రాజకీయ పరమైన అంశాలేవీ చర్చకు రాలేదన్నారు. అంతేకాదు.. ఎవరో టికెట్ కోసం తను జగన్ దగ్గరకు రాయబారిగా వెళ్లాల్సిన అవసరం లేదని తేల్చేశారు. దాంతో.. నాగార్జున రాజకీయాల్లోకి అడుగుపెడుతున్నారన్న విషయంలో ఎలాంటి నిజం లేదని తేలిపోయినట్టైంది.