నాగార్జున – రాంగోపాల్ వర్మల `ఆఫీసర్` శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమాకి ముందు నుంచీ ఎలాంటి హైపూ లేదు. దానికి తగ్గట్టు టాక్ కూడా దారుణంగా ఉంది. వర్మ మరోసారి దారుణంగా ఫెయిల్ అయ్యాడన్న మాటలు వినిపిస్తున్నాయి. సాక్ష్యాత్తూ నాగ్ – వర్మల అభిమానులే ఈ సినిమా చూసి… నొసలు చిట్లిస్తున్నారు. దానికి తగ్గట్టుగానే.. రివ్యూలూ వచ్చాయి. సోషల్ మీడియాలో.. అటు వర్మనీ ఇటు నాగ్నీ ఆడేసుకుంటున్నారు. అయితే.. ఈ సినిమాకొచ్చిన టాక్ పట్ల నాగ్, వర్మ ఇద్దరూ అసంతృప్తితో ఉన్నారని తెలుస్తోంది. `సినిమా బాగానే ఉంది.. కానీ రివ్యూలే సరిగారాలేదు..` అంటూ తమ అసహనం వ్యక్తం చేస్తున్నార్ట. సినిమాకి వసూళ్లు చాలా డల్‌గా ఉన్నాయి. టాక్ ఈ రూపంలో ఉంటే… వీకెండ్ కూడా థియేటర్లు కళకళలాడవు. అందుకే.. ఈ రెండు రోజులూ కాస్త ప్రమోషన్‌పై దృష్టి పెట్టాలని ఆఫీసర్ టీమ్ భావిస్తోంది. నాగ్ – వర్మలపై ఓ ప్రత్యేక ఇంటర్వ్యూ రూపొందించి – టీవీ ఛానళ్లకు ఇచ్చే పనిలో పడ్డారు. ఈ ఇంటర్వ్యూలోనే అటు వర్మ ఇటు నాగ్ ఇద్దరూ కలసి రివ్యూలపై తమ అసంతృప్తిని వ్యక్తం చేసినట్టు టాక్.
తప్పు వర్మదా? నాగ్ దా?
‘ఆఫీసర్’ అంచనాల్నేం తలకిందులు చేయలేదు. ఆ రిజల్ట్ షాకింగ్‌గానూ లేదు. అందరూ ఏం అనుకున్నారో అదే జరిగింది. వర్మ ఖాతాలో మరో ఫ్లాప్ చేరింది. కాకపోతే… అటు వర్మనీ, ఇటు నాగ్నీ పిచ్చి పిచ్చిగా అభిమానించే వాళ్ల మనసుల్లో ఎక్కడో ఏదో మూల ఓ ఆశ. నాగార్జున అంత గట్టిగా నమ్మాడంటే – ఈ కథలో ఏదో ఉండే ఉంటుంది అనే భరోసా. అంటే వర్మ క్రియేటివిటీపై కంటే, నాగార్జున జడ్జిమెంట్‌పై జనాలకు బాగా గురి కుదిరిందన్నమాట. శుక్రవారం ఈ సినిమాకి కనీసం ఇన్ని ఓపెనింగ్స్ వచ్చాయంటే కారణం… వర్మ మహిమ కాదు. నాగ్ వల్లే.
కానీ ఆ చిన్ని ఆశల్నీ వర్మ నిలుపుకోలేకపోయాడు. ఎప్పట్లా తన ఖాతాలో మరో డిజాస్టర్ చేరిపోయింది. ఈ ఫ్లాప్‌తో వర్మకి కొత్తగా మునిగేదేమీ లేదు. కాకపోతే నాగార్జున పరిస్థితి ఏమిటి? `ఈ ఫేజ్‌లో కేవలం మంచి సినిమాలే చేయాలనుకుంటున్నాను..` అని చెప్పుకొనే నాగ్ `ఆఫీసర్` రిజల్ట్‌ని జీర్ణించుకోగలుగుతాడా? నాగ్ జడ్జిమెంట్‌కి తిరుగులేదనుకునే అభిమానులకు నాగ్ ఏమని సమాధానం చెబుతాడు? ఓ సినిమా తీయడం, అది ఫ్లాప్ అవ్వడం మహా పాపాలేం కాదు. కానీ ఓ దర్శకుడి చేతికి అవకాశం ఇస్తున్నామంటే.. సవాలక్ష ప్రశ్నలు వేసుకోవాలి. అందులోనూ వర్మలాంటి దర్శకుడితో. నాగ్ ఈ విషయంలో విఫలమయ్యాడు. తనపై తనకున్న నమ్మంతో ఈ సినిమాని పట్టాలెక్కించేశాడు. అక్కడితో ఆగలేదు. ఈ సినిమా గురించి మాట్లాడేటప్పుడు ‘శివ’తో పోలికలు తీయడం మొదలెట్టాడు. శివ తరవాత ఇంతటి హీరోయిజం ఈ సినిమాలోనే చూశా అంటూ బిల్డప్పులు ఇచ్చుకున్నాడు. సౌండ్ గురించి స్పీచులు దంచేశాడు. నిజానికి ఆఫీసర్ సినిమా టెక్నికల్ విషయంలోనూ బెటర్‌గా లేకపోయింది.
నాగ్ చెబుతున్న `సౌండింగ్ సిస్టమ్` ఏమంత గొప్పగా లేదు. ‘శివ’లో వాడిన కొన్ని ఆర్.ఆర్ బిట్లని ఈ సినిమాలో వాడుకున్నట్టు అర్థమైపోతోంది. సినిమా బాగుంటే… అప్పుడు సౌండ్ గురించీ, సంగీతం గురించి మాట్లాడుకుంటాడు. సినిమాలో విషయం లేకపోతే.. ఇవన్నీ ఎందుకు చర్చకు వస్తాయి. ఈసినిమాతో… వర్మకొచ్చిన నష్టమేం లేదు. ఎప్పట్లా తాను మరో ‘బకరా’ని పట్టుకోగలడు. కాకపోతే.. నాగ్ లాంటి ఓ స్థాయి ఉన్న నటుడు, హీరో అతనికింక దొరక్కపోవొచ్చు. పోయిందల్లా… నాగ్ తనపై తాను పెట్టుకున్న, పెంచుకున్న నమ్మకమే.