మాదాపూర్ పరిసరాల్లో తిరిగే వారికి సగం మాత్రమే మిగిలిపోయిన ఓ చెరువు అందరికీ కనిపిస్తోంది. ఆ చెరువు పేరు తమ్మిడికుంట. అ చెరువులో నిర్మించినట్లుగా స్పష్టంగా కనిపించేలా ఓ పెద్ద నిర్మాణం ఉంటుంది. అదే ఎన్ కన్వెన్షన్ సెంటర్. హీరో నాగార్జునకు చెందినది. చెరువు గట్టుపైనే ఎలాంటి నిర్మాణాలకు అవకాశం ఉండదు.. కానీ ఈ ఎన్ కన్వెన్షన్ ను ఏకంగా చెరువులోనే నిర్మించారు. ఈ కన్వెన్షన్ సెంటర్ లోపలికి వెళ్తే.. డైనింగ్ హాల్ వాల్‌ను ఆనుకునే చెరువులో నీళ్లు ఉంటాయి. అంటే… చెరువుకు అడ్డుకట్టగా గోడ కట్టి ఈ కన్వెన్షన్ సెంటర్ కట్టారన్న మాట.
చెరువు గట్టుపై… బఫర్ జోన్లో ప్రైవేటు స్థలాలున్నా నిర్మాణాలకు అనుమతి ఉండదు. అలాంటిది.. తమ్మిడికుంట చెరువును పూర్తి స్థాయిలో కబ్జా చేసినట్లుగా ఉండే ఎన్ కన్వెన్షన్ మొదటి నుంచి వివాదమే. ఇది వెంటనే కూల్చివేయదగ్గ నిర్మాణమని అందరికీ తెలుసు. పదేళ్ల కిందట కేసీఆర్ సీఎం కాగానే… బులో డోజర్లు ఎన్ కన్వెన్షన్ వైపు దూసుకెళ్లాయి. అయితే అక్కడికి చేరుకునేలోపే ఏం జరిగిందో కానీ… మళ్లీ వెనక్కి పోయాయి. తర్వాత నాగార్జున.. బీఆర్ఎస్ పెద్దలు భాయి భాయి అనుకుంటూ గడిపారు. మరోసారి ఎన్ కన్వెన్షన్ జోలికి ఏ ప్రభుత్వ అధికారి పోలేదు.
Read Also : హైడ్రా దూకుడు :నాగార్జున ఎన్ కన్వెన్షన్కూ టెన్షన్
కానీ ఇప్పుడు కాలం మారింది. ప్రభుత్వం మారింది. ఇలాంటి చెరువుల కబ్జాలపై గురి పెట్టి ప్రత్యేకంగా హైడ్రా అనే వ్యవస్థను రూపొందించి .. దానికి అన్ని రకాల కోరలు ఇచ్చారు సీఎం రేవంత్. ఓ వ్యవస్థను ఏర్పాటు చేయడం కాదు.. దాన్ని నడిపేందుకు బలమైన అధికారిని కూడా నియమించారు. అదే చేశారు. ఆయన చెరువుల గత నలభై ఏళ్ల మ్యాపుల్ని తెచ్చుకుని మొత్తం కబ్జాలపై గురి పెట్టారు. ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరిస్తున్నారు. ఈ క్రమంలో జనం కోసం అనే స్వచ్చంద సంస్థ ఎన్ కన్వెన్షన్ కబ్జాలపై ఫిర్యాదు చేసింది. ఇప్పుడు హైడ్రా ఈ కన్వెన్షన్ సెంటర్ పై దృష్టి పెట్టాల్సి ఉంటుంది.