‘దేవదాస్’ తరవాత అక్కినేని నాగార్జున సినిమా ఏదీ ప్రారంభం కాలేదు. ప్రస్తుతం ఆయన ముందు రెండు ఆప్షన్లు వున్నాయి. ‘సోగ్గాడే చిన్ని నాయనా’ సీక్వెల్ ‘బంగార్రాజు’ చేయడం లేదా ‘మన్మథుడు’కు సీక్వెల్ చేయడం! ‘సోగ్గాడే చిన్ని నాయనా’తో దర్శకుడిగా పరిచయమైన కల్యాణ్‌కృష్ణ ‘బంగార్రాజు’ కథ సిద్ధం చేశాడు. అన్నపూర్ణ స్టూడియోలో కొన్ని రోజులుగా ఈ కథపై కసరత్తులు నడిచాయి. నాగార్జున అనుకున్నట్టుగా కథ వచ్చింది. కాని కథలో మరో పాత్ర నాగచైతన్య చేయాలి. ప్రస్తుతం అతడి చేతిలో ‘మజిలీ’, ‘వెంకీమామ’ సినిమాలు వున్నాయి. అవి పూర్తి చేయడానికి సమయం పడుతుంది. అందుకని ముందుగా ‘మన్మథుడు’ సీక్వెల్ చేయాలని నాగార్జున నిశ్చయించుకున్నార్ట. దీనికి ‘చిలసౌ’తో దర్శకుడిగా పరిచయమైన హీరో రాహుల్ రవీంద్రన్ కథ రచయిత, దర్శకుడు. నాగార్జునకు ‘చిలసౌ’ నచ్చడంతో రాహుల్ చేతిలో రెండు సినిమాలు చేయమని అడ్వాన్సు పెట్టారు. అప్పటినుంచి ‘మన్మథుడు 2’ కథపై కూర్చున్నాడు రాహుల్. త్వరలో షూటింగు మొదలు పెట్టడానికి రెడీ అవుతున్నాడు. త్రివిక్రమ్ కథ, మాటలు ‘మన్మథుడు’ విజయానికి మూల కారణం. ఆ కథకు ఏమాత్రం తీసిపోని విధంగా రాహుల్ రవీంద్రన్ కథ రాశాడట.