చిరంజీవి, నాగార్జున, బాలకృష్ణ, వెంకటేష్.. వీళ్లంతా ఓ తరం హీరోలు. వీళ్ల జర్నీ ఒకే సమయంలో సాగింది. అయితే ఎవరి ఇమేజ్‌లూ వాళ్లవి, ఎవరి మార్కెట్లు వాళ్లవి. రెమ్యునరేషన్ పరంగా ఒకరికి మరొకరితో పొంతన లేదు. వీళ్లందరికంటే చిరంజీవి ముందు వరుసలో ఉన్నారు. ఆ తరవాత బాలయ్య, వెంకీ వస్తారు. నాగార్జున పారితోషికం ఇప్పటికీ రూ.10 కోట్లు దాటలేదు. ఈ విషయంలో నాగ్ కు కాస్త అసంతృప్తి ఉంది. ‘అఖండ’, ‘భగవంత్ కేసరి’ లాంటి భారీ విజయాలతో బాలయ్య రూ.20 కోట్ల వరకూ కోడ్ చేస్తున్నారు. చిరంజీవి రూ.50 కోట్ల మార్క్ ఎప్పుడో దాటేశారు. అయితే ఇప్పుడు నాగ్ పారితోషికం బాగా పెరిగిందని ‘కూలీ’ కోసం ఆయన దాదాపు రూ.25 కోట్ల పారితోషికం తీసుకొంటున్నారని టాక్ వినిపిస్తోంది. ఇదే నిజమైతే మూడు సినిమాలు హీరోగా చేసి, తీసుకోవాల్సిన రెమ్యునరేషన్ ఆయన ఒక్క సినిమాకే అందుకొంటున్నట్టు. శేఖర్ కమ్ముల – ధనుష్ కాంబోలో రూపొందుతున్న ‘కుబేర’లో నాగ్ ఓ కీలక పాత్ర పోషిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా కోసం ఆయన రూ.12 కోట్లు అందుకొన్నారని సమాచారం. ఓరకంగా చూస్తే సోలో హీరోగా చేసినదానికంటే ఇలా మల్టీస్టారర్ చేసినప్పుడే నాగ్ కు ఎక్కువ మొత్తం పారితోషికం అందుతోంది.
‘కూలీ’లో నాగ్ ది ఢిఫరెంట్ క్యారెక్టర్. ఇందులో ఆయన ప్రతినాయకుడిగా కనిపించబోతున్నాడని తెలుస్తోంది. ‘ఖైదీ’ సినిమా చూసినప్పటి నుంచీ నాగ్ లోకేష్ కనగరాజ్‌కు అభిమానిగా మారిపోయాడట. అప్పటి నుంచీ లోకేష్ తో కలిసి పని చేయాలని భావిస్తున్నాడట. నాగ్ కు ఆ అవకాశం ‘కూలీ’తో వచ్చింది. తలైవా రజనీకాంత్ తో నాగ్ ఒక్క సినిమా కూడా చేయలేదు. ఆ లోటు కూడా ఈ సినిమాతో తీరబోతోంది. హీరోగా కాస్త డల్ ఫేజ్‌లో ఉన్న నాగ్ కు ‘కూలీ’, ‘కుబేర’ బాగానే కలిసొచ్చాయని చెప్పాలి.