ఫిబ్రవరి 14న ప్రేమికుల రోజు. మహేష్‌బాబు, నమ్రత ప్రేమ వివాహానికి నేటితో 14 ఏళ్లు. మహేష్-నమ్రత పెళ్లి రోజు ఈ రోజు. అలాగే, వరల్డ్ మ్యారేజ్ డే (ఫిబ్రవరిలో రెండో ఆదివారం) కూడా ఈ రోజే. ఈ సందర్భంగా నమ్రతను ఒక ప్రముఖ పత్రిక ఇంటర్వ్యూ చేసింది. మహేష్‌తో ప్రేమ, పెళ్లి, పెళ్లి తరవాత జీవితం గురించి నమ్రత ఇంటర్వ్యూలో చెప్పిన ముఖ్యాంశాలు…
– `వంశీ` షూటింగ్‌కు మహేష్, నేను న్యూజీలాండ్ వెళ్ళాము. అప్పటికి మేం ఫ్రెండ్స్. తిరిగొచ్చాక ప్రేమలో వున్నామని అర్థమైంది. లవర్స్ అయ్యాము. ముందు నేనే ప్రపోజ్ చేశా. మహేష్‌కి ఫోన్ చేసి చెప్పా. అప్పటికి తనూ నన్ను ప్రేమిస్తున్నాడు. ఒకరి గురించి మరొకరికి పూర్తిగా తెలుసు. పెళ్లి చేసుకోవాలనుకున్నాం.
– పెళ్లి తరవాత సినిమాల్లో నటించడం నాకిష్టం లేదు. కెరీర్‌కి, కుటుంబానికి న్యాయం చేయలేనని నా ఫీలింగ్. మహేష్ కూడా నాన్ వర్కింగ్ వైఫ్ కావాలని కోరుకున్నాడు. ఒకవేళ నేను సినిమాల్లో నటిస్తే కొన్ని రోజులు మహేష్‌కి దూరంగా వుండాలి. నాకు అదీ ఇష్టం లేదు. అందుకని, అప్పటికి నేను అంగీకరించిన సినిమాలు పూర్తి చేశాక పెళ్లి చేసుకున్నాం.
– పెళ్లి తరవాత ఎప్పుడూ నటించాలని అనిపించలేదు. నటన గురించి ఆలోచించేంత సమయమూ నాకు లేదు. పిల్లలు, ఫ్యామిలీతో సరిపోతుంది. సరదాగా అతిథి పాత్రలు చేయాలని కూడా అనిపించలేదు.
– మహేష్‌కి, నాకు మధ్య సమస్యలు వుండవు. ఒకవేళ ఏదైనా సమస్య వస్తే ఇద్దరం కూర్చుని ఎందుకు వచ్చిందీ సమస్య అని అలోచించి పరిష్కరించడానికి కృషి చేస్తాం.
– మహేష్ తీసుకునే ప్రతి నిర్ణయం వెనుక నా ప్రమేయం వుంటుందని జరుగుతున్న ప్రచారం పూర్తిగా అబద్ధం. మహేష్ నిర్ణయాల్లో నా జోక్యం వుండదు. స్వంత నిర్ణయాలు తీసుకుంటారు.
– తండ్రిగా, భర్తగా మహేష్‌కి పదికి పది మార్కులు వేస్తా. నటుడిగా అయితే పదికి ఇరవై మార్కులు వేస్తా. మాటవరసకు, మీరు అడిగారని చెప్పడం లేదు. నిజాయతీగా చెబుతున్నా.
– ఇంట్లో మహేష్ మంచి భర్తలా, తండ్రిలా, సాధారణ వ్యక్తిలా వుంటారు. పిల్లలతో ఎంజాయ్ చేస్తారు. డాన్స్ చేస్తారు. ఖాళీ సమయాల్లో సినిమాలు చూస్తారు.
– నా జీవితంలో పెళ్లి తరవాత ఈ 14 ఏళ్లు బెస్ట్. పెళ్లి నాకు దక్కిన బెస్ట్ & స్పెషల్ గిఫ్ట్.
తెలుగు360 డాట్ కామ్ తరపున తరపున మహేష్, నమ్రత దంపతులకు పెళ్లి రోజు శుభాకాంక్షలు.