జగన్ తో తెలుగు సినీ పరిశ్రమ పెద్దలు త్వరలో భేటీ కానున్నారు. తెలంగాణ ప్రభుత్వం తో సినీ పరిశ్రమ భేటీ అయిన సందర్భంలో తనను పిలవలేదని బాలకృష్ణ అలగడం, భేటీకి హాజరైన పరిశ్రమ పెద్దలు భూములు పంచుకుంటున్నారా అంటూ బాలకృష్ణ విమర్శలు చేయడం తెలిసిందే. అయితే ఈసారి ఎటువంటి వివాదాలు పునరావృతం కాకూడదనే ఉద్దేశంతో బాలకృష్ణని జగన్ తో భేటీకి ఆహ్వానించిప్పటికీ, ఆయన పుట్టిన రోజు సందర్భంగా హాజరు కాలేక పోతున్నారు అని నిర్మాత సి.కళ్యాణ్ ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే ఈ సమస్యపై మరొకసారి ఒక టీవీ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో స్పందించారు బాలకృష్ణ.
తెలంగాణ సినీ పరిశ్రమ భేటి తర్వాత బాలకృష్ణ దానిని విమర్శిస్తూ వ్యాఖ్యలు చేసిన అనంతరం , మంత్రి తలసాని బాలకృష్ణతో తానే స్వయంగా మాట్లాడతాను అన్న విషయం తెలిసిందే. అయితే బాలకృష్ణ మాట్లాడుతూ, మంత్రి తలసాని తనకు ఫోన్ చేయలేదని, అలాగే కేవలం ఒక ఆర్టిస్టు మాత్రమే తనను జగన్ తో జరగబోయే భేటీ కి పిలిచాడు అని, జగన్ తో భేటీకి తాను హాజరు కావడం లేదని బాలకృష్ణ అన్నారు. సినీ పరిశ్రమ పెద్దల భేటీ, ఈ తతంగమంతా స్టూడియో లకి భూముల కోసమే అని బాలకృష్ణ వ్యాఖ్యానించారు. వివాదం ఎప్పుడు సద్దుమణుగుతుంది అన్న ప్రశ్నకు స్వార్థం ఉన్నంతవరకు ఈ వివాదం సద్దుమణగదు అని వ్యాఖ్యానించారు బాలకృష్ణ.
బాలకృష్ణ తాజా వ్యాఖ్యలపై సినీ పెద్దలు ఎలా స్పందిస్తారో వేచి చూడాలి