ఒకప్పుడు నంది అవార్డ్ అంటే ఓ గౌరవం, క్రేజ్. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే అవార్డులు కాబట్టి కచ్చితంగా గొప్ప మైలేజీ ఉంటుంది. అవార్డు ప్రకటన, ప్రదానం కార్యక్రమాలు సందడిగా సాగేవి. అయితే కొన్నేళ్లుగా ఆ వైభవం లేదు. జగన్ రెడ్డి హయాంలో వైకాపా ప్రభుత్వం అవార్డుల మాట అటుంచితే, చిత్రసీమకు సరైన గౌరవమే ఇవ్వలేదు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారం చేజిక్కించుకొంది. టీడీపీ ముందు నుంచీ సినిమా వాళ్ల పక్షమే. ఈసారైనా నంది అవార్డులు ఇస్తారని, తెలుగు చిత్రసీమకు పూర్వ వైభవం వస్తుందని గంపెడాశలతో ఉన్నారంతా. అయితే.. నంది అవార్డులు ఇవ్వడం అంత తేలికైన విషయంలా కనిపించడం లేదు. దానికి చాలా కారణాలు ఉన్నాయి.
2011 నుంచి అవార్డులు పెండింగ్‌లో ఉన్నాయి. 2011 నుంచి 2016 వరకూ అవార్డు విజేతల్ని ప్రభుత్వం ప్రకటించింది. కానీ అవార్డుల ప్రదానమే చేయలేదు. 2017 నుంచి 2023 వరకూ అవార్డుల ఊసే లేదు. అంటే ఇప్పుడు అవార్డులు ఇవ్వాలంటే 13 ఏళ్ల లోటు భర్తీ చేయాలి. 2011 నుంచి 2016 వరకూ ప్రకటించిన విజేతలు ప్రదానం చేయాలి. ఆ తరవాత 2017 నుంచి 2023 వరకూ అవార్డు గ్రహీతల్ని ఎంపిక చేయడానికి జ్యూరీ ఏర్పాటు చేయాలి, వాళ్లు విజేతల్ని ఎంపిక చేయాలి, ఆ తరవాత ప్రకటించాలి. ఇదంతా చాలా పెద్ద ప్రోసెస్. 13 ఏళ్ల అవార్డుల్ని ఒకేసారి ఇవ్వడం దాదాపుగా అసాధ్యం. ఈ కార్యక్రమం ఒకేసారి ఒకే సిరీస్‌లా నిర్వహించాలంటే కనీసం వారం రోజులైనా పడుతుంది. కనీసం 2011 నుంచి 2016 వరకూ విజేతల్ని ఎలాగూ ప్రకటించేశారు కాబట్టి, వాళ్లందరికీ గంపగుత్తగా ఒకేసారి అవార్డుల్ని అందించి, 2017 నుంచి 2023 వరకూ మరో జాబితా విడుదల చేసి, వాళ్లకు సైతం ఒకేసారి అవార్డులు ఇచ్చేస్తే… ఓ పనైపోతుంది. అయితే ఈ ప్రోసెస్ జరగడానికే కనీసం 2 నెలల సమయం పడుతుంది.
13 ఏళ్ల అవార్డులూ ఒకే వేదికపై ఇవ్వడం కుదరదు. కాబట్టి మూడు రోజుల పాటు ఓ పండగలా నిర్వహించి కాస్త ఘనంగానే చేయాలన్న ప్లాన్ ఏపీ ప్రభుత్వానికి ఉంది. ఈ విషయమై చంద్రబాబు కూడా చిత్రసీమకు హామీ ఇచ్చినట్టు తెలుస్తోంది. ఈ 13 ఏళ్ల పెండింగ్ లిస్ట్ పూర్తయిన తరవాత ఇక మీదట ప్రతీ యేడాదీ క్రమం తప్పకుండా అవార్డులు ఇచ్చేలా చూస్తామని కూడా భరోసా ఇచ్చారని సమాచారం.
* హీరోలొస్తారా?
నిజానికి నంది అవార్డుల కార్యక్రమంపై శ్రద్ధ తగ్గడానికి మరో ప్రధాన కారణం ఉంది. నంది అవార్డులంటే హీరోలెవరూ పెద్దగా ఆసక్తి చూపించడం లేదు. ప్రైవేటు అవార్డు ఫంక్షన్‌కు హుషారుగా వెళ్లిపోయే నటీనటులు నంది అవార్డులకు మొహం చాటేస్తున్నారు. అవార్డు కార్యక్రమానికి హీరోలు, హీరోయిన్లు డుమ్మా కొట్టిన సందర్భాలు కోకొల్లలు. ‘వాళ్లకే లేని ఇంట్రస్ట్ మనకెందుకు’ అని ప్రభుత్వ పెద్దలు భావించడంలో తప్పేం లేదు. నిజానికి నంది అవార్డుల్ని ఫిల్మ్ ఫేర్ రేంజ్ లో ఓ ప్రైవేటు కార్యక్రమంలా నిర్వహిస్తే – లుక్ మారిపోతుంది. కొత్త గ్లామర్ యాడ్ అవుతుంది. కాకపోతే అది బాగా ఖర్చుతో కూడుకున్న వ్యవహారం. ఏపీ అసలే అప్పుల్లో ఉంది. ఈ దశలో ఇలా అవార్డు ఫంక్షన్లకు కోట్లకుకోట్లు ఖర్చు పెడితే ప్రజల్లో వ్యతిరేకత వస్తుంది. కాబట్టి అవార్డు కార్యక్రమాలెప్పుడూ సింపుల్‌గానే ఉండేలా చూస్తారు. ఆ సింప్లిసిటీ మన హీరోలకు నచ్చక డుమ్మా కొడతారు. ఇప్పుడు ఈ 13 ఏళ్ల అవార్డుల్ని ఒకేసారి ఇచ్చినా హీరోలు, హీరోయిన్లు వచ్చి, అవార్డులు తీసుకెళ్తారా, ఆ ఉత్సాహం వాళ్లకు ఉందా అనేది మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారింది.