ఆంధ్ర ప్రదేశ్ రాజకీయాల్లో మార్పులు చేర్పుల తొలి సంకేతం కాబోతున్న నంద్యాల ఉప ఎన్నిక ఆగష్టు 23న జరగనున్నట్టు ఎన్నికల సంఘం ప్రకటించింది. 28న లెక్కింపు ఫలితం ప్రకటన. అంటే ఈ రాజకీయ సస్పెన్స్ మరో నెలరోజులేనన్నమాట. ఇప్పటికే ఇరుపక్షాల మధ్య కురుక్షేత్రంలా మారిన నంద్యాలలో విజయం టిడిపి విశ్వాసం నిలబెట్టుకోవడానికి కీలకం. అందుకే స్వయానా ముఖ్యమంత్రి చంద్రబాబు, ఆయన కుమారుడు లోకేశ్‌లు మకాం వేసి మరీ వరాలు పదవుల పందేరాలు నిర్వహించారు.తమ అభ్యర్థి భూమా బ్రహ్మానందరెడ్డి యాభై వేల మెజార్టితో గెలుస్తారని ప్రకటిస్తున్నారు. అయినా అధికార పక్షంలో ఉత్కంఠ అధికంగానే వుంది. గతసారి కేవలం మూడు వేల ఓట్ల స్వల్ప తేడాతో ఓడిపోయిన శిల్పా మోహనరెడ్డి వైసీపీ అభ్యర్థిగా వుండటం, ప్రభుత్వంపై ప్రజలలో అసంతృప్తి కొన్ని తరగతుల ఆగ్రహం ఇందుకు కారణాలవుతున్నాయి. వైసీపీ కోణంలో చూస్తే మూడేళ్ల టిడిపి పాలన తర్వాత వచ్చిన ఈ ఉప ఎన్నిక మరింత పెద్ద సవాలు. గతంలో ఇక్కడ తమ టికెట్టుపై గెలిచి తర్వాత పాలకపక్షంలో దూకిన భూమా నాగిరెడ్డి మరణం వల్ల జరుగుతున్నది గనక మళ్లీ గెలుచుకోవడం ప్రతిష్టకు ఉనికికి సంబంధించిన సవాలుగా వుంటుంది. శిల్పాతో సహా చాలామంది ఇటుకూడా వచ్చిన తర్వాత కూడా గెలవకపోతే పలచనగావుంటుందని వైసీపీ భయపడుతున్నది. అన్నిటినీ మించి ఎన్నికల సలహాదారు ప్రశాంత కిశోర్‌కు ఇది ముందస్తు పరీక్ష కాబోతున్నది. 40 ఏళ్ల రాజకీయ జీవితంలో 14 ఎన్నికలు నిర్వహించిన తనకు ఏం చేయాలో బాగా తెలుసని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నమాటలు ప్రశాంత కిశోర్‌కు సమాధానమని పరిశీలకులంటున్నారు. మరి ఈ వ్యూహాల పోరాటంలో జయాపజయాలు తెలియాలంటే నెల ఆగితే చాలు.