నంద్యాల ఉప ఎన్నికల ఫలితం రాష్ట్ర రాజకీయాలపై అంచనాలోనూ పునసమీకరణల్లోనూ ఒక మలుపు కాగలదని పరిశీలకులు నాయకులు కూడా అనుకుంటున్నారు. మంత్రి భూమా అఖిలప్రియకు తోడుగా తెలుగుదేశం హేమాహేమీలు రంగ ప్రవేశం చేసి సకల శక్తియుక్తులూ మొహరించి గెలిచేందుకు ప్రయత్నించడం తథ్యం. మరోవైపున వైసీపీ వైపు నుంచి చూస్తే గతంలో ఆ పార్టీ తరపున గెలిచిన స్థానం కావడం, శిల్పా మోహనరెడ్డి వచ్చి చేరడంతో విజయం సాధించడం సవాలుగా మారుతుంది. ఎందుకంటే ఇన్ని మార్పుల తర్వాత కూడా గెలవకపోతే రాజకీయ పునాదిగా వున్న రాయలసీమలో ఆ పార్టీకి విశ్వసనీయత తగ్గుతుంది. కడపలో బిటెక్ రవి, సతీష్ రెడ్డి, సిఎం రమేష్ వంటి వారు ప్రభుత్వ యంత్రాంగాన్ని కూడా అందుబాటులో వుంచుకుని జగన్ నాయకత్వానికి తిరుగులేదన్న వాతావరణం కాస్త మారుస్తున్నారని ఇతర పార్టీల వారు కూడా చెబుతున్నారు. విశాఖలో లోగడ వైఎస్ విజయమ్మ ఓటమికి తోడు ఇటీవల శాసనమండలి ఎన్నికల్లో వైఎస్వివేకానందరెడ్డి కూడా ఓడిపోవడం ఆ కుటుంబం పట్టును కొంతవరకూ తగ్గించాయని జిల్లా రాజకీయాల్లో ఆరితేరిన కాంగ్రెస్ వాది ఒకరు చెప్పారు. ఈ పరిస్థితుల్లో నంద్యాలలో విజయం సాధించలేకపోతే వైసీపీకి రాజకీయంగా చిక్కులు వస్తాయని ఆయన అన్నారు. అప్పుడు టిడిపి కూడా రాజకీయ దాడిని తీవ్రం చేస్తుందని హెచ్చరించారు. నంద్యాలలో శిల్పా మోహనరెడ్డి రావడం వల్ల కొంత వరకూ వైసీపికి మేలు జరుగుతుంది గాని అంతకు ముందు ఆశపెట్టుకున్న వారు ఏ మేరకు పనిచేస్తారు ముఠాతగాదాల ప్రభావం ఎలా వుంటుంది తదితర సమస్యలున్నాయి. భూమా వర్గంలోనూ విభేదాలు వచ్చే అవకాశముంది. అఖిలప్రియను మొదట్లోనే దెబ్బతీయాలని భావించే వర్గం కూడా ఒకటుంది. కాబట్టి ఈ విషయమై హడావుడి జోస్యాలు చెప్పడం వ్యర్థం.