రాజకీయాల్లో ప్రత్యర్థులను దెబ్బ తీయడానికి అధికార పార్టీ చేతిలో ఓ కొత్త అవకాశం చేరింది. దాని పేరు.. ‘అభివృద్ధి’! దీన్ని ప్రజల అవసరాల కోసం కాకుండా, అధికార పార్టీ బలోపేతానికి పనికొచ్చే విధంగా ఎలా వాడుకోవాలో తెలుగు రాష్ట్రాల అధికార పార్టీలకు బాగా వంటపట్టేసింది! మొన్నటికి మొన్న ఈ ‘అభివృద్ధి’ ద్వారా ఎలా విజయం సాధించవచ్చు అనేది నంద్యాల ఎన్నికల్లో టీడీపీ చేసి చూపించింది. ఆ నియోజక వర్గంలో ఉప ఎన్నిక వస్తుందని అనగానే… అభివృద్ధి పనులు చకచకా మొదలైపోయాయి. కోట్ల కోట్లు నిధుల మంజూరు అయిపోయింది. అధికార పార్టీ నేతలు, అధికారులు, క్షేత్రస్థాయి కార్యకర్తలు.. ఒకరనేంటీ, అందర్నీ ఉరకలూ పరుగులూ తీయించి మరీ నంద్యాల సమస్యల్ని తీర్చేశారు! వైకాపాకి మాంచి పట్టు ఉన్న నంద్యాలలో టీడీపీ జెండా ఎగరేశారు. అది ‘అధికారాని’కి ఉన్న పవర్ అంటే. అచ్చంగా ఇదే ఫార్ములాను ఇప్పుడు నల్గొండ విషయంలో అమలు చేసేందుకు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ సిద్ధమౌతున్నారని చెప్పొచ్చు!
నల్గొండ లోక్ సభ స్థానానికి ఉప ఎన్నిక వస్తుందో రాదో అనేది పక్కన పెడితే, ఆ జిల్లా కాంగ్రెస్ కు కంచుకోటగా నిలుస్తూ వస్తోంది. పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి, జానారెడ్డి, కోమటిరెడ్డి సోదరులు.. వీరంతా ఆ జిల్లా నుంచే ప్రాతినిధ్యం వహిస్తున్నారు. కేసీఆర్ కు ఈ జిల్లాలపై ఇంకా పట్టు దొరకలేదు. అందుకే, ఇప్పుడీ జిల్లాపై అత్యంత శ్రద్ధ కనబరుస్తున్నారు. వచ్చే ఎన్నికల్లోపు నల్గొండ జిల్లాలోని ప్రముఖుల నియోజక వర్గాలను అనుహ్యంగా అభివృద్ధి చేయాలనే వ్యూహంతో ఉన్నారు. ముందుగా, నల్గొండ అసెంబ్లీ నియోజక వర్గాన్ని లక్ష్యం పెట్టుకుని అభివృద్ధి వ్యూహం అమలు చేస్తున్నారు. ఆ తరువాత, మిగతా నేతల నియోజక వర్గాలు! నల్గొండ అభివృద్ధి పనుల కోసం రూ. 500 కోట్లు విడుదల చేస్తున్నారు. దీంతోపాటు ఒక వైద్య కళాశాల, ఐటీ పార్క్ కూడా త్వరలో ప్రకటిస్తారట! పదివేల డబుల్ బెడ్ రూమ్ ల ఇళ్లు ఇక్కడే కట్టబోతున్నారు. రూ. 19 కోట్లతో రహదారుల నిర్మాణానికి పనులు కూడా మొదలుపెట్టేశారు. దీంతోపాటు జిల్లాలోని పెండింగ్ ఉన్న ఎత్తిపోతల పథకం పనుల వేగాన్ని పెంచారు. జిల్లాలో చేపడుతున్న కార్యక్రమాలపై ఇప్పటికే కలెక్టర్ తో మీటింగులు నిర్వహించారు. సీఎంతోపాటు మంత్రి హరీష్ రావు, జగదీశ్వర్ రెడ్డి, ఎంపీ గుత్తా సుఖేందర్ రెడ్డి, అధికార పార్టీకి చెందిన మరో ఎమ్మెల్యే కూడా క్షేత్రస్థాయి పనులను పరిశీలిస్తున్నారు. నల్గొండ మున్సిపాలిటీలో కూడా అధికారులతో ప్రత్యేక కమిటీలు ఏర్పాటు చేశారు.
ఇంత శ్రద్ధ గతంలో ఎందుకు కనబరచలేదు.? ప్రజలు పడుతున్న కష్టాలు ఇప్పుడే కనిపిస్తున్నాయా..? అభివృద్ధి చేయాల్సిన ఆవశ్యకత ఇన్నాళ్ల తరువాతే గుర్తొచ్చిందా..? ప్రజా సంక్షేమం అనేది అధికార పార్టీకి రాజకీయ లబ్ధి చేకూర్చే కార్యక్రమంగా మారిపోతోంది. రాజకీయంగా ఉపయోగం ఉంటే తప్ప అభివృద్ధి చేయరు అన్నట్టుగానే వ్యవహరిస్తున్నారు. నల్గొండ జిల్లాలో కీలక కాంగ్రెస్ నేతలకు చెక్ పెట్టాలన్న ఒకేఒక్క అజెండాతో కేసీఆర్ కు ఆ ప్రాంతంపై అమాంతంగా ప్రేమ పెరిగిపోయిందని అనొచ్చు. ఆంధ్రాలో నంద్యాల కావొచ్చు, ఇప్పుడు తెలంగాణలో నల్గొండ కావొచ్చు… ఈ రెండుచోట్లా అభివృద్ధి కార్యక్రమాల పేరుతో అధికార పార్టీలు చేస్తున్నది ఫక్తు రాజకీయమే అనడంలో ఎలాంటి సందేహం లేదు. సీఎం చంద్రబాబుకు నంద్యాలలో వర్కౌట్ అయిన ఈ అభివృద్ధి ఫార్ములా, కేసీఆర్ కు నల్గొండలో ఏ మేరకు ఫలిస్తుందో చూడాలి మరి!