ఏపీ రాజకీయాల్లో మార్పులూ చేర్పులూ మాంచి జోరుమీదున్నాయి! అనుకున్నచోట టిక్కెట్లు దక్కని నేతలు నిరాశ చెందకుండా ఏదో ఒక పార్టీ నుంచి సీటు దక్కించుకోవడమే లక్ష్యంగా పావులు కదుపుతున్నారు. ఇదే క్రమంలో జనసేన పార్టీలో చేరారు నంద్యాల ఎంపీ ఎస్పీవై రెడ్డి. బుధవారం సాయంత్రం జనసేన అధినేత పవన్ కల్యాణ్ ని కలిసి పార్టీ కండువా మార్చేశారు. గత ఎన్నికల్లో వైకాపా టిక్కెట్ పై ఎస్పీవై రెడ్డి గెలిచారు. ఆ వెంటనే టీడీపీలో చేరారు. ఈసారి టీడీపీ నుంచి ఎంపీ సీటు వస్తుందని భావించారు. కానీ, నంద్యాల టిక్కెట్ ను మాండ్ర శివానందరెడ్డికి టీడీపీ కేటాయించింది. దీంతో తీవ్ర అసంతృప్తికి లోనయ్యారు ఎస్పీవై రెడ్డి!
ఎంతో నమ్మకంతో టీడీపీలో చేరితే తనను చంద్రబాబు నాయుడు నట్టేట ముంచారంటూ తీవ్ర విమర్శలు చేశారు. స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తాననీ, తన సత్తా ఏంటో చూపించుకుంటానంటూ సవాల్ కూడా చేశారు. అయితే, ఇదే సమయంలో జనసేన నుంచి ఆయనకి ఆహ్వానం అందినట్టు తెలుస్తోంది. పార్టీలో చేరితే నంద్యాల ఎంపీ టిక్కెట్ పక్కా అంటూ జనసేనాని ఆఫర్ ఇచ్చారని సమాచారం. మొత్తానికి, నంద్యాల బరిలో ఎస్పీవై రెడ్డి కూడా గట్టి పోటీ ఇచ్చే క్రమంలో ఉన్నారన్నది స్పష్టమైంది.
ఎస్పీ వై రెడ్డి చేరడం జనసేనకి ప్లస్ అవుతుందని చెప్పొచ్చు. ఎందుకంటే, ప్రస్తుతం పవన్ కల్యాణ్ ఫోకస్ అంతా కేవలం గోదావరి జిల్లాలకు మాత్రమే పరిమితమైపోయిందనే భావన ఏర్పడుతోంది. భీమవరం నుంచి పవన్ పోటీ చేయడం, నర్సాపురం నుంచి నాగబాబుని బరిలోకి దించడం… గాజువాకలో పవన్ పోటీ, విశాఖ నుంచి మాజీ జేడీ లక్ష్మీ నారాయణ పోటీ.. ఇలా జనసేనలో కీలకం అనుకున్నవారంతా గోదావరి, ఉత్తరాంధ్రలో మాత్రమే పోటీ చేస్తున్న పరిస్థితి. నిజానికి, రాయలసీమ నుంచి తన పోటీ ఉంటుందని గతంలో పవన్ కల్యాణ్ అన్నారు. కొన్నాళ్లపాటు సీమ వెనకబాటుతనం గురించే మాట్లాడారు. తీరా ఎన్నికలకు వచ్చేసరికి సీమపై జనసేనాని ఫోకస్ పెట్టడం లేదా అనే అభిప్రాయం కలుగుతోంది. కారణం… రాయలసీమ ప్రాంతం నుంచి ఆశించిన స్థాయిలో ప్రముఖ నాయకులెవ్వరూ జనసేన గూటికి చేరలేదు. ఇప్పుడు ఎస్పీవై రెడ్డి కూడా ప్రత్యేక పరిస్థితుల్లో వచ్చి చేరారు. వదిలి వచ్చిన వైకాపాకి తిరిగి వెళ్లలేరు, టీడీపీ సీటు ఇవ్వలేదు. మిగులున్న మూడో ఆప్షన్ జనసేన! సరే… పరిస్థితులు ఏవైనా జనసేనకు రాయలసీమ ప్రాంత జిల్లాల నుంచి ఒక ప్రముఖ నేత ఉన్నారని ఎస్పీవై రెడ్డి చేరికతో చెప్పుకునే అవకాశం వచ్చింది. ఇంకా ఏవైనా చేరికలుంటాయేమో చూడాలి.