గత వారం విడుదలైన సినిమా ‘సరిపోదా శనివారం’. ఈమధ్య కాలంలో బాక్సాఫీసు దగ్గర కాస్త కాసుల గల గల వినే అవకాశం ఇచ్చింది. నాని ఖాతాలో మరో హిట్ పడింది. అయితే సినిమా డ్యూరేషన్ విషయంలో చాలా కంప్లైంట్స్ ఉన్నాయి. సినిమా లెంగ్త్ పెరిగిందని, కనీసం 20 నిమిషాలు ట్రిమ్ చేసినా ఫలితం ఇంకా మెరుగ్గా ఉండేదని సినీ విశ్లేషకులు తేల్చేశారు. అయితే ఈ సినిమాలో ఇంకో రెండు ఫన్నీ సీన్లు ఉన్నాయట. అవి చివర్లో డిలీట్ చేశార్ట. అవి కూడా ఉండి ఉండుంటే… ఈ సినిమా లెంగ్త్ మరింత పెరిగిపోయేది. అప్పుడు మొదటికే మోసం వచ్చేదేమో.
నాని – అలీ మధ్య రెండు కామెడీ సీన్లు ఉన్నాయి. అవి బాగానే ఉన్నా, లెంగ్త్ సమస్య వల్ల కట్ చేయాల్సివచ్చిందని ‘సరిపోదా శనివారం’ థ్యాంక్స్ మీట్ లో స్వయంగా నానినే చెప్పాడు. అలీ అంటే తనకు చాలా ఇష్టమని, తమ మధ్య సన్నివేశాల్ని నిడివి దృష్ట్యా తొలగించాల్సి వచ్చిందని నాని పేర్కొనడం విశేషం. బహుశా వాటిని ఓటీటీలో చూడొచ్చేమో. వివేక్ ఆత్రేయ దాదాపు 3 గంటల సినిమా తీశాడు. ఫైనల్ కట్ 2 గంటల 50 నిమిషాలకు తేలింది. చివరి నిమిషంలో నాని ఎంటర్ అయి మరో 5 నిమిషాలు తీసేశాడు. లెంగ్త్ విషయంలో వివేక్ ఆత్రేయ కాస్త జాగ్రత్తగా ఉండాలి. ‘అంటే సుందరానికీ’ కూడా ఇలానే లెంగ్త్ ఇష్యూతో నలిగిపోయింది. ఆ కథని షార్ప్‌గా చెప్పి ఉంటే మంచి ఫలితమే వచ్చి ఉండేది. నాని, సూర్య లాంటి నటీనటులు ఉన్నారు కాబట్టి ‘సరిపోదా..’లో లెంగ్తీ సీన్లు ఉన్నా ప్రేక్షకులు భరించారు. ప్రతీసారీ… ఇలాంటి వెసులుబాటు ఉండకపోవొచ్చు.