రాజమౌళి కథల్లో సీక్వెల్ చేయదగిన స్క్రిప్టు ‘ఈగ’. ఈ కథకు రెండో భాగం కూడా ఉంటుందని అప్పట్లో అనుకొన్నారు. నాని కూడా రాజమౌళిని ‘పార్ట్ 2 ఎప్పుడూ’ అని సభాముఖంగానే అడిగాడు. రాజమౌళి ముసి ముసి నవ్వులు నవ్వడం తప్ప దీనికి సమాధానం చెప్పలేదు. ఇప్పుడు రాజమౌళి ఉన్న కండీషన్లో ‘ఈగ 2’ గురించి ఆలోచించే అవకాశం చాలా తక్కువ. కానీ నాని మాత్రం ‘ఎప్పటికైనా ఈగ 2 వస్తుంది’ అనే ఆశల్లో ఉన్నాడు.
”ఈగ అప్పట్లో ఓ ప్రయోగం. ఇప్పుడున్న మార్కెట్, రాజమౌళి క్రేజ్ వేరు. ఇప్పుడు ‘ఈగ’ తీస్తే అది వరల్డ్ బ్లాక్ బస్టర్ అవుతుంది. అయితే రాజమౌళి గారు ప్రస్తుతం ఉన్న పొజీషన్లో ఈ కథపై దృష్టి పెడతారా లేదా అనేది చూడాలి. ఇది పూర్తిగా ఆయన చేతుల్లో ఉన్న విషయం” అని తేల్చేశాడు నాని. నిజానికి ‘ఈగ’ కథని ఇప్పుడు తీస్తే తప్పకుండా అది హాలీవుడ్ స్టాండర్డ్ లో తీయొచ్చు. అంత టెక్నాలజీ మనకు అందుబాటులో ఉంది. రాజమౌళి క్రేజ్, ఆయన ఇమేజ్‌తో వరల్డ్ వైడ్ మార్కెట్ చేసుకోవొచ్చు. కావల్సినంత ఖర్చు పెట్టొచ్చు. ‘ఈగ 2’ ఎలాంటి కథతో చేయాలి అనే ఆలోచన కూడా రాజమౌళికి ఉంది. కాకపోతే అది ఆయన పక్కన పెట్టేశారు. పాత కథల్ని మళ్లీ టచ్ చేయడంలో కిక్ లేదన్నది రాజమౌళి పాయింట్. అందుకే ‘విక్రమార్కుడు 2’ జోలికి కూడా ఆయన వెళ్లలేదు. ఇవే కథలకు సీక్వెల్స్ తీసి, వాటిని హిట్ చేయగలిగే సమర్థ్యం మరో దర్శకుడికి లేదు. అందుకే ఆ సీక్వెల్స్ ఐడియాల దగ్గరే ఆగిపోయాయి.