కొన్ని కాంబినేషన్స్ భలే సింక్ అయిపోతాయి. ఒకరిని ఒకరు అర్ధం చేసుకుని ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రాజెక్ట్స్ చేసుకుంటారు. నాని, వివేక్ ఆత్రేయలది అలాంటి కాంబినేషనే. ఈ కాంబో వచ్చిన మొదటి సినిమా ‘అంటే సుందరానికీ’ బాక్సాఫీసు వద్ద నిరాశ పరిచింది. ఒక సెటప్ అడియన్స్ కి సినిమా నచ్చింది కానీ ఓవరాల్ గా అప్సెట్ చేసింది. అయితే నానికి వివేక్ మీద నమ్మకం తగ్గలేదు. ‘సరిపోదా శనివారం’తో ఈ జోడి మళ్ళీ వచ్చింది. ఈసారి మాస్ హిట్ కొట్టారు. ఇంత వర్షాల్లో కూడా సినిమా కలెక్షన్స్ లో ఆదరగొట్టింది.
ఈ కాంబినేషన్ ని చాలా విషయాల్లో మెచ్చుకోవాలి. సినిమాని వోన్ చేసుకొని పని చేశారు. క్రిడెట్ విషయంలో కూడా చాలా నిజాయితీగా వున్నారు. ఈ సినిమాలో నాని కంటే ఎస్జే సూర్య క్యారెక్టర్ కే ఆడియన్స్ బాగా కనెక్ట్ అయ్యారు. సూర్య పెర్ఫార్మెన్స్ ని ఎంజాయ్ చేశారు. సూర్యకి రావాల్సిన క్రెడిట్ ని విజయ వేడుకలో స్వయంగా ప్రకటించాడు నాని. ‘సరిపోదా శనివారం హీరో ఎస్జే సూర్య’ అని నాని చెప్పడం అందరికీ నచ్చింది. అలాగే ఈ సినిమా సక్సెస్ క్రెడిట్ కూడా వివేక్ ఖాతాలోనే వేశాడు నాని.
అటు వివేక్ కూడా చాలా నిజాయితీ గా తను చేసిన తప్పులని ప్రస్థావించాడు. ‘నా రైటింగ్ లో కొన్ని తప్పులు వున్నాయి. సినిమా చూసినప్పుడు నాకు తెలుస్తుంది. అయితే నేను ఎంచుకున్న నటులు నా తప్పులని సరిదిద్దేలా నటించారు. నేను ఒక స్థాయిలో స్క్రిప్ట్ రాస్తే దాన్ని మరో స్థాయిలో నిలబెట్టారు. ఈ క్రెడిట్ అంతా వాళ్ళదే’ అని ఓపెన్ గా చెప్పాడు.
ఎవరి క్రెడిట్ వాళ్ళకి ఇచ్చేయడం మంచిది. కష్టపడి చేసినవాళ్ళకి, ప్రతిభ కనబరిచిన వారికి గుర్తింపు దక్కాలి. ఈ విషయంలో నాని, వివేక్ ఆత్రేయ నిజాయితీగా వుండటం అభినందనీయం.