రెమ్యునరేషన్ తీసుకొన్నామా, సినిమా పూర్తి చేశామా, వదిలేశామా? కొంతమంది హీరోలు ఇలానే ఆలోచిస్తుంటారు. ఒకసారి `పేకప్` చెప్పేశాక, మేకప్ తీసేశాక, సినిమా గురించి ఏమాత్రం పట్టించుకోరు. ప్రమోషన్లకు రమ్మంటే బెట్టు చేయడం, నిర్మాతకు ఫోన్లోనూ టచ్‌లో లేకుండా పోవడం తరచూ జరిగే విషయాలే. కొంతమంది హీరోలు మాత్రం అలా కాదు. సినిమా రిలీజ్ అయి, థియేటర్లలోంచి వెళ్లిపోయేంత వరకూ ఏదోలా ఆ సినిమాని వీలైనంత ప్రమోట్ చేస్తుంటారు. అలాంటి హీరోల్లో నాని మొదటి వరుసలో ఉంటాడు. తన సినిమాని జనంలోకి తీసుకెళ్లడానికి నాని పడే కష్టం కళ్లముందు కనిపిస్తూనే ఉంది.
ప్రమోషన్ గురించి పక్కన పెడితే, బెస్ట్ క్వాలిటీ ఇవ్వడానికి అహర్నిశలూ శ్రమిస్తూనే ఉంటాడు. అందుకు ‘సరిపోదా శనివారం’ పెద్ద ఉదాహరణ. ఈ సినిమా ప్రమోషన్లపై నాని చాలా ఫోకస్డ్ గా ఉన్నాడు. పాన్ ఇండియా పేరుతో ముంబై, బెంగళూరు, చెన్నై తిరుగుతూనే ఉన్నాడు. అతంతా ఒక ఎత్తు. చివరి నిమిషంలో ఎడిటింగ్ టేబుల్ దగ్గర నాని చేస్తున్న కసరత్తు మరో ఎత్తు. ఈ చిత్ర దర్శకుడు వివేక్ ఆత్రేయ కొన్ని వారాలుగా ఎడిట్ రూమ్ కి అంకితమైపోయారు. ఆయన ప్రమోషన్లలోనూ పెద్దగా కనిపించడం లేదు. రాత్రీ పగలూ పోస్ట్ ప్రొడక్షన్ వర్క్‌లోనే బిజీగా ఉండడం వల్ల రెండ్రోజులుగా బాగా అలసిపోయి, జ్వరంతో ఆసుపత్రి పాలయ్యారు. దాంతో పోస్ట్ ప్రొడక్షన్ పనులు దగ్గరుండి చూసుకొనే బాధ్యత నానిపై పడింది. పొద్దస్తమానూ ప్రమోషన్లు, రాత్రి పోస్ట్ ప్రొడక్షన్ వర్క్. గత నాలుగు రోజులుగా నాని చేస్తున్న పని ఇదే. ఈ నాలుగు రోజుల్లోనూ నాని మొత్తమ్మీద పది గంటలు కూడా నిద్రపోలేదట. అయినా సరే, సినిమాని ప్రమోట్ చేయాలన్న ఆశయంతో… అలసట కనిపించకుండా పని చేసుకొంటూనే వెళ్తున్నాడు. ‘రెమ్యునరేషన్ మొత్తం ఇవ్వకపోతే డబ్బింగ్ చెప్పను. ప్రమోషన్లకు రాను. మీడియా ఇంటర్వ్యూలు ఇవ్వను’ అని గిరి గీసుకొని కూర్చునే హీరోలంతా నానిని చూసి సిగ్గు పడాల్సిందే.