కథల ఎంపికలో నాని చూపించే వైవిధ్యం తెలియనిది కాదు. నిర్మాతగానూ తనది అదే పంథా. హీరోగా సినిమా చేస్తున్నప్పుడు కమర్షియల్ మీటర్‌పై ఎక్కువగా శ్రద్ధ పెట్టే నాని, నిర్మాతగా మాత్రం రిస్క్ చేస్తుంటాడు. తాను ప్రొడ్యూస్ చేసిన తొలి చిత్రం ‘ఆ’ ఒక రకంగా ప్రయోగమే. ‘హిట్’, ‘హిట్ 2’ కమర్షియల్‌గా నానికి మంచి విజయాల్ని అందించాయి. ఇప్పుడు మరోసారి ప్రయోగాత్మక బాట పట్టాడు. ప్రియదర్శి హీరోగా నాని సొంత బ్యానర్ వాల్ పోస్టర్ పతాకంపై ఓ సినిమా రూపుదిద్దుకొంటోంది. దీనికి ‘కోర్ట్’ అనే టైటిల్ ఖరారు చేశారు. ఈరోజు విడుదల చేసిన ఫస్ట్ లుక్‌లో బోనులో ఉన్న న్యాయ దేవతని చూపించారు. దీన్ని బట్టి ఇదో కోర్ట్ రూమ్ డ్రామా అనేది అర్థం అవుతోంది. ‘స్టేట్ వర్సెస్ ఏ నో బడీ’ అనే క్యాప్షన్ మరింత ఆసక్తిని రేకెత్తిస్తోంది. రామ్ జగదీష్ ఈ చిత్రానికి దర్శకుడు. శివాజీ, సాయి కుమార్, రోహిణి, హర్షవర్థన్, శ్రీదేవి ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. ఈరోజు హైదరాబాద్ లో ఈ చిత్రాన్ని లాంఛనంగా మొదలుపెట్టారు. సెప్టెంబరు నుంచి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుంది. హిట్ ఫ్రాంచైజీలతో కమర్షియల్ పంధా అనుసరించిన నాని… ఈసారి మాత్రం ఏదో ప్రయోగం చేస్తున్నాడనిపిస్తోంది. కోర్ట్ రూమ్ డ్రామాలకు మంచి డిమాండ్ ఉంది. దానికో సెపరేట్ ఆడియన్స్ ఉన్నారు. ప్రయోగాత్మకమే అయినా పకడ్బందీగా తీస్తే రాసులు రాల్చే టెక్నిక్ ఈ జోనర్‌కు ఉంది.