సినిమా టికెట్ ధరల విషయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై హీరో నాని చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగా వున్నాయి. ”రాజకీయ నాయకులు, సినిమా వాళ్లు అనే విషయాన్ని పక్కన పెడితే ప్రేక్షకుల్ని అవమానించేలా ఈ నిర్ణయం ఉందన్నారు. టికెట్ ధరలు తగ్గించడం అంటే ప్రేక్షకులను అవమానించడమే. థియేటర్ల కంటే పక్కన ఉన్న కిరాణా షాపుల కలెక్షన్ ఎక్కువగా ఉంది. పది మందికి ఉద్యోగం ఇచ్చి థియేటర్ నడుపుతున్న వారికంటే కిరాణా షాప్ కలెక్షన్స్ ఎక్కువగా వుండటం సెన్స్ లెస్. టికెట్ కొనే సామర్థ్యం ప్రేక్షకులకు ఉంది. కానీ ప్రభుత్వమే ప్రేక్షకులకు ఆ స్థాయి లేదని నిర్ణయించం.. నిజంగా ప్రేక్షకులని అవమానించినట్లే” అని వాఖ్యనించాడు నాని.
నాని మాటల్లో ఇండస్ట్రీ వాయిస్ వినిపించింది. ఇండస్ట్రీలో చాలా మంది ఇదే ఫీలౌతున్నారు. అటు థియేటర్ యజమానులు కూడా సినిమాల ని ఆడించలేక క్లోజ్ చేసుకునే పరిస్థితి నెలకొంది. బాల్కనీ టికెట్ ధర రూ. 20గా వుంది. కోన్ ఐస్ క్రీమ్ కొనుక్కుకొని తినాలన్నా యాబై రూపాయిలు కావాలి. కానీ దాని కంటే చవకగా టికెట్ ధర నిర్ణయించడం వెనుక ప్రభుత్వం ఆలోచన ఏమిటో ఎవరికీ అంతుపట్టదు. ఈ విషయంలో ఏం మాట్లాడిన వివాదం అవుతుందని చాలా మంది మౌనంగా వున్నారు. అయితే ఇదే పరిస్థితి కొనసాగితే త్వరలోనే ఇండస్ట్రీ నుంచి కలసికట్టుగా ఒక ప్రకటన వచ్చే అవకాశం వుంది. ఎందుకంటే ఈ రెట్లతో సినిమాలు తీసి వాడిని థియేటర్ లో ఆడించడం కాని పని.