తెలుగుదేశం పార్టీ యువ నేత, చంద్రబాబు తనయుడు ఈ సారి ప్రత్యక్ష ఎన్నికల బరిలో నిలవడం ఖాయంగా కనిపిస్తోంది. నియోజకవర్గ ఎంపిక కసరత్తు చేసుకుంటున్న ఆయన.. చివరికి… గెలుపును సవాల్‌గా తీసుకోవాలని నిర్ణయించుకుని.. భీమిలిని ఎంచుకున్నారని టీడీపీ వర్గాలు చెబుతున్నాయి. భీమిలి నియోజకవర్గం నుంచి లోకేష్ ఎన్నికల్లో పోటీ చేయడం.. దాదాపు ఖాయమయిందని టీడీపీ వర్గాలు చెబుతున్నాయి. నిజానికి లోకేష్ పేరు కుప్పం, హిందూపురం, పెనమలూరు, పెదకూరపాడు.. వంటి నియోజకవర్గాల్లో చర్చకు వచ్చినా… ఆయన మాత్రం.. ఉత్తరాంధ్ర నుంచి పోటీ చేయాలని అనుకున్నారు. దాని ప్రకారం.. భీమిలి అయితే బాగుంటుందనే నిర్ణయానికి వచ్చారు. సర్వేలు, ఇతర కసరత్తులు చేసుకుని… రంగంలోకి దిగితే బెటరని నిర్ణయించుకున్నారు.
ప్రస్తుతం భీమిలి నియోజకవర్గం నుంచి గంటా శ్రీనివాసరావు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. అక్కడ్నుంచి.. టీడీపీలో ఉన్న సమయంలోనే.. టిక్కెట్ కోసం ఎంపీ అవంతి శ్రీనివాస్ ప్రయత్నించారు. ఇవ్వరని తేలిన తర్వాత వైసీపీలో చేరిపోయారు. వెంటనే అక్కడే ఆయనకు టిక్కెట్ ఇవ్వబోతున్నట్లు జగన్ సంకేతాలు పంపారు. నియోజకవర్గ ఇన్చార్జ్గా నియమించారు. గంటా శ్రీనివాస్ కొంత కాలంగా.. తాను భీమిలి నుంచి పోటీ చేస్తానని చెబుతూ వస్తున్నారు. కానీ.. లోకేష్ అక్కడనుండి పోటీ చేయాలని నిర్ణయించుకోవడంతో.. ఆయన విశాఖ ఉత్తర స్థానాన్ని ఎంపిక చేసుకునే అవకాశాలు ఉన్నాయంటున్నారు. గత ఎన్నికల్లో అక్కడ పొత్తుల్లో భాగంగా బీజేపీకి కేటాయించారు. ఈ సారి కొత్త అభ్యర్థిని ఎంపిక చేయక తప్పదు. అందుకే.. విశాఖ ఈ స్థానాన్ని ఎంపిక చేసుకున్నారని చెబుతున్నారు.
భీమిలి నుంచి లోకేష్ పోటీ చేస్తే.. సంప్రదాయ రాజకీయాలకు.. దాదాపుగా చెక్ పెట్టినట్లే చెప్పుకోవాలి. ఎందుకంటే.. ఇప్పుడు రాజకీయ నేతలు కానీ… విజయం కోసం తమ సామాజికవర్గం అత్యధికంగా ఉండే నియోజకవర్గాన్ని చూసుకుని మరీ పోటీ చేస్తున్నారు. కానీ లోకేష్ ముందు.., తమ సామాజికవర్గం ఓటర్లు మెజార్టీ ఉన్న నియోజకవర్గాలు ఉన్నప్పటికీ.. అనూహ్యంగా ఆయన భీమిలి నియోజకవర్గాన్ని ఎంచుకున్నారు అక్కడ లోకేష్ సామాజికవర్గం ఓటర్లు ప్రభావిత స్థాయిలో ఉండరు. ప్రముఖులుగా చెప్పుకునే మిగిలిన నేతలు కూడా.. ఇదే పద్దతి ఫాలో అయితే.. రాజకీయాల్లో సామాజికవర్గం పెద్ద విషయం కాదన్న.. చిన్న సందేశాన్ని.. ప్రజల్లోకి పంపినట్లవుతందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.