ఎన్నికలు దగ్గరపడుతున్న కొద్దీ అధికార పార్టీ తెలుగుదేశంలో టిక్కెట్ల హడావుడి మొదలైంది. పార్టీ అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా ఇదే కసరత్తులో ఉన్నారు. పార్టీలో అసంతృప్తిగా ఉంటున్న నేతలతో ఆయన భేటీ అవుతూ, నియోజక వర్గాల వారీగా సీట్ల సర్దుబాటుపై చర్చలు కొనసాగిస్తున్నారు. అయితే, ఈ తరుణంలో రాజధాని ప్రాంత నియోజకవర్గమైన మంగళగిరికి సంబంధించి ఒక ఆసక్తికరమైన చర్చ పార్టీ వర్గాల్లో జరుగుతున్నట్టు సమాచారం. రాజధాని ప్రాంతంలో తెలుగుదేశం పార్టీ పట్టు నిలబెట్టుకోవాలంటే, ఇక్కడి నుంచి బలమైన అభ్యర్థిని రంగంలోకి దించితే బాగుంటుందనే అభిప్రాయం శ్రేణుల నుంచి వినిపిస్తున్నట్టుగా తెలుస్తోంది.
రాజధాని ప్రాంతం కావడంతో టీడీపీ అధినాయకత్వం కూడా ఈ నియోజక వర్గంపై ప్రత్యేక దృష్టి సారించింది. అయితే, గత ఎన్నికల్లో మంగళగిరిలో టీడీపీ ఓడిపోయింది. దీంతో ఈసారి ఈ నియోజక వర్గం విషయంలో పక్కా వ్యూహంతోనే ముందుకు వెళ్లేందుకు ప్రయత్నిస్తోంది. మంగళగిరిలో టీడీపీ ఇన్ ఛార్జ్ గా గంజి చిరంజీవి ఉన్నారు. వచ్చే ఎన్నికల్లో ఆయన టిక్కెట్ ఆశిస్తున్నారు. అయితే, గంజి నాయకత్వంపై పార్టీ శ్రేణుల్లోనే భిన్నాభిప్రాయాలు వినిపిస్తున్న పరిస్థితి ఉందని సమాచారం. దీంతో ఆయనకి టిక్కెట్ అనుమానమే అనే చర్చ కూడా ఎప్పట్నుంచో ఉంది. గంజి చిరంజీవికి బదులుగా ఎవరైనా కొత్త అభ్యర్థికి టిక్కెట్ ఇవ్వాలంటూ స్థానిక పార్టీ శ్రేణులు అధిష్టానాన్ని కోరిన సందర్భాలూ ఉన్నాయి.
ఈ నేపథ్యంలో మంగళగిరి నుంచి ఎన్నికల బరిలోకి వచ్చే టీడీపీ అభ్యర్థి ఎవరనే చర్చ ఇప్పుడు పార్టీలో కీలకంగా మారుతోంది. రాజధాని ప్రాంతం కాబట్టి ఇక్కడ పట్టు నిలుపుకోవాలనీ, మంత్రి నారా లోకేష్ ఇక్కడ్నుంచి పోటీ చేస్తే బాగుంటుందనే అభిప్రాయం స్థానిక కేడర్ నుంచి వినిపిస్తోంది. రాజధాని ప్రాంతంలో ఊపు రావాలంటే, నారా లోకేష్ అభ్యర్థిత్వం అవసరం అనే డిమాండ్ వ్యక్తమౌతున్నట్టు తెలుస్తోంది. ఈ నియోజక వర్గంలో టీడీపీకి సంస్థాగతంగా మంచి పట్టు ఉందనీ, సరైన నాయకత్వం లేకపోవడం వల్లనే గత ఎన్నికల్లో ఓటమి పాలైందనీ, లోకేష్ లాంటి నాయకత్వ సారథ్యం ఉంటే టీడీపీకి ఇది కంచుకోటగా మారడం ఖాయమనే ధీమా వ్యక్తం చేస్తున్నాయి పార్టీ శ్రేణులు. పార్టీ కేడర్ నుంచి వినిపిస్తున్న ఈ డిమాండ్ ను టీడీపీ అధినాయకత్వం ఎలా చూస్తోందని తెలియాల్సి ఉంది.