తెలంగాణలో ప్రధాని మోదీ పూర్తిగా క్యాస్ట్ పాలిటిక్స్ మీద ఆధారపడుతున్నారు. ఏడో తేదీన బీసీ ఆత్మగౌరవ సభ పేరుతో బహిరంగసభ నిర్వహిస్తున్న ఆయన మరోసారి పదకొండో తేదీన తెలంగాణకు వస్తున్నారు ఈ సారి మందకృష్ణ మాదిగ నేతృత్వంలో జరిగే ఎస్సీ వర్గీకరణ సభలో పాల్గొంటారు. ప్రధాని స్థాయిలో ఉన్న నేతలు ఇలాంటి సమావేశాల్లో పాల్గొనవచ్చా లేదా అన్నది ఎవరి విలువలకు తగ్గట్లుగా వారికి ఉంటుంది. బీజేపీ అగ్రనేత మాత్రం పాల్గొంటారు.
ఓ బీసీ తెలంగాణ బీజేపీ అధ్యక్షుడిగా ఉంటే.. కారణం లేకుండా తొలగించి.. అదీ కూడా పార్టీని తన నాయకత్వ ప్రతిభతో బలపర్చినప్పటికీ ఆయనను తొలగించి కిషన్ రెడ్డికి కూర్చోబెట్టారు. అప్పటి నుంచి పార్టీ దిగజారిపోయింది. ఇప్పుడు బీసీ సీఎంను చేస్తామని ప్రకటించి… రేసులోకి వస్తామని ఆశపడుతున్నారు. మోదీ బీసీ ఆత్మగౌరవం పేరుతో సభ నిర్వహిస్తున్నారు. ప్రధాని స్థాయిలో ఉన్న వ్యక్తి తాను బీసీనని చెప్పుకోవడమే భారత ప్రజాస్వామ్యంలో ప్రత్యేకత. ఇప్పుడు ఎంతో కాలంగా వివాదాస్పదంగా ఉన్న ఎస్సీ వర్గీకరణ సభలో పాల్గొంటున్నారు.
2014లో ప్రధానమంత్రి అభ్యర్థిగా ఉన్నప్పుడు నరేంద్ర మోడీ తనకు తాను ఎస్సీ వర్గీకరణ అంశంపై మాట్లాడారని, తమను కలిసి ఎస్సీ వర్గీకరణను చట్టబద్ధం చేస్తామని హామీ ఇచ్చారని ఇటీవలే మందకృష్ణ మాదిగ అన్నారు. కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ అంశంపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని, ఇప్పటికైనా వర్గీకరణ అంశంలో స్పష్టమైన వైఖరి ప్రకటించాలని ఆయన ఇటీవల ప్రధానిని కోరారు. ఆయనకు ప్రధాని అపాయింట్ మెంట్ ఇవ్వడం ఆప్యాయంగా పలకరించడంతో ఏదో ఉందని అనుకున్నారు. ఇప్పుడు అది నిజం అవుతోంది. ఎస్సీ వర్గీకరణ ప్రకటిస్తే మాదిగలంతా మద్దతు పలుకుతారని మోదీ నమ్ముతున్నారు.
తర్వాత ఎలాంటి సభలు పెడతారో కానీ అవి అందరినీ ఉద్దేశించిన బహిరంగసభలు అవుతాయా.. లేకపోతే కుల సమావేశాలు అవుతాయా అన్నది చూడాల్సి ఉంది.