ఆకాశమే హద్దుగా ఎదిగిన బీజేపీ నాలుగంటే నాలుగేళ్లలో నేలబారుకి పడిపోయింది. భారతీయ జనతా పార్టీకి ఈ పరిస్థితి రావడానికి .. పూర్తిగా నరేంద్రమోదీ మీద ఆధారపడటమే కారణం. మోదీని పోస్టర్ బాయ్ గా పెట్టుకుని బీజేపీ ఎదిగే ప్రయత్నం చేసింది. కానీ ఓ వ్యక్తి ఇమేజ్ శిఖరంలా ఎదిగిన తర్వాత నేల చూపులు చూడటమే తప్ప… మరింత ఎదిగే పరిస్థితి ఉండదు. ప్రస్తుతం మోదీ పరిస్థితి కూడా అంతే. దేశంలో ఇక తిరుగులేదనుకున్న స్థితిలో నరేంద్రమోదీ… అటు పాలనలో.. ఇటు రాజకీయాల్లో నియంత లాంటి ప్రవర్తనకు అలవాటు పడ్డారు. ఫలితంగా… బీజేపీని వ్యతిరేకించే… ముఖ్యంగా నరేంద్రమోదీని వ్యతిరేకించే పార్టీలన్నీ ఏకమయ్యాయి.
తమ మధ్య తరతరాల వైరుధ్యమున్నా… పక్కన పెట్టి.. మోదీపై పోరాటానికి ఎక్కువయ్యాయి. గడ్డిపోచలు మదగజాన్ని కూడా బంధించగలవని నిరూపించేందుకు ముందడుగు వేస్తున్నాయి. మోదీ ప్రస్తుత పరిస్థితిని .. కొంత మంది విశ్లేషకులు…1977లో ఇందిగాంధీతో పోలిస్తున్నారు. ఇండియాయే ఇందిర.. ఇందిరయే ఇండియా అన్న ప్రచారం ఓ రేంజ్ లో జరిగిన తర్వాత.. ఇందిరా గాంధీ… తనకు ఎదురుతిరిగిన పరిస్థితులను ఆహ్వానించలేకపోయారు. 1975లో ఎమర్జెన్సీ విధించారు. 1977లో మళ్లీ ఎన్నికలు నిర్వహించాలని ఇందిరాగాంధీ స్వయంగా నిర్ణయించుకునేవరకూ..ఈ ఎమర్జెన్సీ సాగింది. ఇందిర నియంతృత్వ పాలనకు వ్యతిరేకంగా.. దేశంలోని చిన్నాచితకా పార్టీలన్నీ ఏకమయ్యాయి. అప్పుడు కాంగ్రెస్ పార్టీకి ప్రత్యామ్నాయంగా ఏ పార్టీ లేదు. జనతాపార్టీనే ఓ మాదిరి బలంగా ఉంది. నియంతృత్వానికి, ప్రజాస్వామ్యానికి మధ్య పోరాటంగా ఆ ఎన్నికలను విపక్షాల్ననీ కలసి కట్టుగా ఎదుర్కొన్నాయి. కాంగ్రెస్ పార్టీ దారుణంగా ఓడిపోయింది.
అప్పుడు ఇందిరాగాంధీ బలంగా లేని విపక్ష పార్టీల నుంచి సవాళ్లను ఎదుర్కొన్నారు. కానీ ఇప్పుడు నరేంద్రమోదీ… దాదాపుగా ప్రతీ రాష్ట్రంలోనూ బలంగా ఉన్న ప్రాంతీయ పార్టీలతో పోరాడుతున్నారు. ఈ ప్రాంతీయ పార్టీలన్నీ ఏకమయ్యాయి. నరేంద్రమోదీని అధికారంలో నుంచి దింపేయాలన్న ఏకైక అజెండాను పెట్టుకున్నాయి. బెంగళూరు వేదికగా… కుమారస్వామి ప్రమాణస్వీకారోత్సవ వేడుకలో… బలప్రదర్శన కూడా చేశాయి. ఇది ఒక్క సందర్భానికే కాదని.. ఆయా పార్టీల నేతలు… అవకాశం వచ్చినప్పుడల్లా చేతల్లో కూడా చూపిస్తున్నారు. యూపీలో ఎస్పీ, బీఎస్పీ, కాంగ్రెస్, ఆర్ఎల్డీల కూటమి… బీజేపీకి దాదాపుగా చెక్ పెట్టేసింది.
యూపీలో పట్టు కోల్పోతే..మోదీ మళ్లీ ప్రధాని కావడం అసాధ్యమే.భారతీయ జనతా పార్టీ.. వ్యక్తిపై ఆధారపడి … నియంతృత్వ ధోరణులతో.. విపక్ష పార్టీలన్నీ ఏకమయ్యేలా బీజేపీనే చేసుకుంది. ఇప్పుడు బీజేపీకి మిత్రపక్షమంటూ లేని పరిస్థితి. ప్రస్తుతం కూటమిలో ఉన్న శివసేన, జేడీ యూ కూడా.. వచ్చే ఎన్నికల్లో కలసి పోటీ చేసే గ్యారంటీ లేదు. అంటే మోదీ ఒక వైపు.. దేశం మొత్తం ఒకవైపు అన్నట్లుగా పరిస్థితి మారనుంది