ఏ ఇంటి దగ్గర ఏ పాట పాడాలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి బాగా తెలుసు! తెలంగాణలో ప్రచారానికి వచ్చేసరికి… ఇక్కడ వర్కౌట్ అయ్యే అంశాలని వారు ఏవైతే అనుకుంటున్నారో, వాటినే ప్రధానంగా ప్రస్థావిస్తూ ప్రధాని మాట్లాడారు. హైదరాబాద్ లో జరిగిన బహిరంగ సభలో మోడీ మాట్లాడుతూ…. దేశభక్తి, ఎమ్.ఐ.ఎమ్. ఈ రెండు అంశాలను ప్రముఖంగా ప్రస్థావించారు. హైదరాబాద్ లో అభివృద్ధి నిరోధక శక్తిగా ఎమ్.ఐ.ఎమ్. ఉంటోందనీ, ప్రజల్లో జీవితాల్లో మార్పులు రావడం వారికి ఇష్టం ఉండదన్నారు. ఇక, ఇలాంటి పార్టీలో అధికార పార్టీ తెరాస చేతులు కలిపిందన్నారు. ఆరునెలల సావాసం చేస్తే వారు వీరౌతారనీ, కేసీఆర్ వారితో ఆరేళ్లుగా సావాసం చేస్తూ వారి భావజాలాన్ని, ఆలోచనా విధానాన్ని అలవరచుకున్నారని విమర్శించారు. పాలన కేసీఆర్ దే అయినా, స్టీరింగ్ మజ్లిస్ చేతిలో ఉందన్నారు.
సైనిక చర్యల్ని రాజకీయాలకు వాడుకోమని గతంలో చాలాసార్లు చెప్పిన ప్రధాని… అదే టాపిక్ మాట్లాడారు. దేశంలో విచ్ఛిన్నకర శక్తులను మద్దతు ఇచ్చేలా కాంగ్రెస్ వ్యవహరిస్తోందనీ, కానీ తమ వ్యవహార శైలి ఎలా ఉంటుందో ప్రజలకు తెలుసుననీ, శత్రువులు ఎక్కడున్నా వారి ఇళ్లలో దూరి పని పడతామన్నారు. శత్రువులపై దాడులకు వెళ్తే ఓటు బ్యాంకు ఏమౌతుందో అనే భయం తమకు లేదనీ, ఎన్నికలు వస్తాయి, పోతాయనీ, దేశాన్ని రక్షించడమే ప్రథమ కర్తవ్యం అన్నారు. దేశద్రోహులు, ప్రజలు మధ్యలో మోడీ అడ్డుగోడగా నిలబడి ఉంటారన్నారు. మనందరం కలిసి బలమైన దేశాన్ని నిర్మించాలనీ, దేశం బలంగా ఉండాలంటే బలమైన ప్రభుత్వం ఉండాలనీ, మీరు వేసే ఓటు బలమైన దేశం కోసమనీ, బలమైన ప్రభుత్వం కోసమనీ, మీరు వేసే ఓటు మోడీ కోసమని చెప్పారు. మోడీ టు దేశం అన్నమాట!
దేశ ప్రధాని ప్రసంగంలో.. ఐదేళ్ల పాలనలో విజయాల ప్రస్థావన లేదు. ఐదేళ్లపాటు ప్రజల బతుకుల్లో వారు తీసుకొచ్చిన అనూహ్య మార్పుల అంశాలు లేవు. సరే, అవన్నీ మాట్లాడాలనుకుంటే డీమానటైజేషన్ లాంటి ఘోర వైఫల్యాలు ప్రజలకు గుర్తొస్తాయనే అనుకుందాం! అలాంటప్పుడు, రాబోయే ఐదేళ్లలో ఏం చెయ్యబోతున్నారు, దేశానికి కొత్త దిశ ఎలా ఇవ్వబోతున్నారు, ప్రధానిగా దేశానికి ఇవ్వనున్న కొత్త మార్గదర్శకత్వం ఏంటి… ఇలాంటివేవీ మోడీ ప్రసంగాల్లో ఉండటం లేదు. ఒక సగటు రాజకీయ నాయకుడి మాదిరిగా… భావోద్వేగాలను రెచ్చగొట్టే అంశాలను మాత్రమే ఎన్నికల ప్రచారంలో వాడుకుంటున్నారు.