ఇప్పుడు భాజపాకి కొత్త ముఖాలు కావాలట..! నిజమే, వచ్చే లోక్ సభ ఎన్నికల్లో భాజపా తరఫు ఎంపీలుగా పోటీ చేసేందుకు కొత్త అభ్యర్థుల కోసం వెతుకులాట ప్రారంభించారట భాజపా నేతలు. ఎన్నికలు దగ్గరపడుతున్న ఈ తరుణంలో ఎంపీల నుంచి పనితీరు నివేదికను ప్రధాని మోడీ కోరారు. గడచిన ఐదేళ్లలో చేపట్టిన కార్యక్రమాలపై రిపోర్టులు సేకరిస్తున్నారు. ఉత్తరప్రదేశ్, బీహార్, మహారాష్ట్రలతోపాటు ఉత్తరాదిన మరికొన్ని చోట్ల భాజపా ఎంపీల పనితీరుపై సర్వేలు చేయించారట! గత ఎన్నికల్లో మోడీ హవాతో నెగ్గిన నాయకులు… ఐదేళ్లు ఏం చేశారు, ఇప్పుడు వారి గురించి ప్రజలు ఏమనుకుంటున్నారని సర్వేలు చేయించారు. ఈ లెక్కల ప్రకారం దాదాపు 50 శాతం మందికి ఈసారి భాజపా టిక్కెట్లు దక్కడం అనుమానమే అని తెలుస్తోంది.
ఇంతకీ, భాజపా విశ్లేషణ ఏంటంటే… గత ఎన్నికల్లో మోడీ హవా బాగుంది కాబట్టి, చాలామంది ఎంపీలుగా గెలిచేశారు. రాబోయే ఎన్నికల్లో కూడా మోడీ హవా అంతే తీవ్రంగా ఉంటుందని వారి తీవ్ర విశ్వాసం! కాబట్టి, ఈసారి కూడా ఎవరికి టిక్కెట్లు ఇచ్చినా ఈజీగా గెలిచేస్తారనేది భాజపా అధినాయకత్వం ధీమాగా కనిపిస్తోంది. అలాంటప్పుడు, ఇప్పుడు సిటింగులుగా ఉన్నవారికే మరోసారి టిక్కెట్లు ఇవ్వొచ్చు కదా అంటే… అలా ఇవ్వరట! ఎందుకంటే, ఎంపీ టిక్కెట్లు దగ్గరకి వచ్చేసరికి వ్యక్తిగత పనితీరును చూస్తున్నారు. ఈ నెల 20 లోగా భాజపా ఎంపీలు అందరి దగ్గర్నుంచీ నివేదికలు తెప్పించుకుని… వారివారి నియోజక వర్గాల్లో గడచిన ఐదేళ్లుగా చేసిన అభివృద్ధి ఏంటనేది చూస్తారట! పార్టీని బలోపేతం కోసం వారు చేపట్టిన కార్యక్రమాలేంటనేవి కూడా లెక్కిస్తారట. ముందస్తు అంచనా ప్రకారమైతే దాదాపు యాభై శాతం ఎంపీలకు ఈసారి టిక్కెట్లు దక్కవనే చర్చ పార్టీలో వినిపిస్తోంది.
విచిత్రం ఏంటంటే… ఆయా రాష్ట్రాల్లో దాదాపు 50 శాతం మంది ఎంపీలకు టిక్కెట్లు ఇవ్వరంటే అర్థమేంటి… వారు ఫెయిలయినట్టే కదా! ఆ ఫెయిల్యూర్ కి కారణం ఎవరు… పార్టీ అధినాయకత్వం, ప్రభుత్వాన్ని నడుపుతున్న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తీసుకున్న నిర్ణయాలు వైఫల్యాలు. ఒకరో ఇద్దరో ఎంపీల పనితీరు బాగులేదంటే… అది వారివారి వ్యక్తిగత పనితీరుగా చూడొచ్చు. ఏకంగా, సగం మంది పనితీరు బాలేదంటే… అది నాయకత్వ లోపం. దాన్ని పట్టించుకోకుండా… కొత్త ముఖాల కోసం మోడీ చూస్తున్నారంటూ పార్టీ వర్గాలు చెప్పడం అసంబద్ధంగా ఉంది. నిజానికి, గత ఎన్నికల్లో చలామణి అయిన మోడీ హవా, ఈసారి కాదు. అధికార పార్టీగా వారు చేసిన తప్పుల్ని… ఎంపీల వ్యక్తిగత వైఫల్యాలుగా విశ్లేషిస్తుంటే ఏమనుకోవాలి..?